పశువులు సైతం మెచ్చుకునేలా వరద సాయం: జగన్

వరద నష్టంపై వెంటనే అంచనాలు పూర్తి చేసి.. ఈ సీజన్‌లోనే ప‍‌రిహారం చెల్లిస్తామని సీఎం జగన్‌ కోనసీమలోని బాధితులకు హామీ ఇచ్చారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన ఆయన.. జి.పెదపూడిలంక వద్ద వంతెన నిర్మిస్తామన్నారు. వరద సాయం అందని ఒక్కరిని కూడా చంద్రబాబు చూపించలేకపోయారని, ఈ విష‌యంలో ఆయ‌న విఫ‌ల‌మ‌య్యార‌ని సీఎం జగన్‌ విమర్శించారు.

కోనసీమ జిల్లాలోని గోదావరి వరద బాధిత ప్రాంతాల్లో సీఎం జగన్ పర్యటించారు. హెలికాప్టర్‌లో తాడేపల్లి నుంచి పి. గన్నవరం మండలం జి.పెదపూడిలంక చేరుకున్న సీఎం.. అక్కడి నుంచి బూరుగులంక రేవుకు వెళ్లారు. పంటు ఎక్కి వశిష్ట గోదావరి దాటిన జగన్‌… ట్రాక్టర్‌పై లంక గ్రామాలను పరిశీలించారు. పుచ్చకాయలవారిపేట, అరిగెలవారిపేట, ఉడిమూడిలంకల్లోని వరద బాధితులతో మాట్లాడారు. జి.పెదపూడి లంక వద్ద వంతెన నిర్మిస్తామని సీఎం జగన్‌ హామీ ఇచ్చారు.

రాజోలు మండలం మేకలపాలెం ఏటిగట్టు వద్ద వరద బాధితులను పరామర్శించిన సీఎం.. అండగా ఉంటామని హామీ ఇచ్చారు. నోరుంటే పశువులు సైతం మెచ్చుకునేలా వరద సాయం చేయాలని అధికారులకు ఆదేశాలిచ్చామన్నారు. ప్రభుత్వం ఇచ్చే నిత్యావసరాలు, సహాయ చర్యలపై ఆరా తీశారు. సీజన్‌ ముగియక ముందే వరద నష్టం అందిస్తామన్నారు. లంక గ్రామాల్లో పర్యటన అనంతరం.. రాజోలులో వరద నష్టాన్ని పరిశీలించిన సీఎం జగన్‌ రాజమహేంద్రవరం వెళ్లారు. రాత్రికి అక్కడే బస చేయనున్నారు.

ఏలూరు జిల్లా ముంపు మండలాల్లో బుధ‌వారం సీఎం జగన్ పర్యటన సాగనుంది. తొలుత ప్రజాప్రతినిధులతో సీఎం సమావేశం కానున్నారు. అనంతరం కన్నయ్యగుట్టలో వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి తిరుమలాయపురం, నార్లవరం ప్రజలతో సీఎం జగన్ ముఖాముఖి మాట్లాడతారు. తిరుమలాయపురం వరదప్రాంతాల ఫొటో ప్రదర్శన తిలకించనున్నారు. రేపు మధ్యాహ్నం ముంపు గ్రామాల నుంచి సీఎం తిరుగు పయనం కానున్నారు.