దేశంలోని 28 మంది ముఖ్యమంత్రుల్లో బెంగాల్ సీఎం మమతకు ఉన్న పేరు.. బ్రాండ్ సపరేటు. ఆమె నోరు విప్పితే.. నిప్పులు రాలాల్సిందే. ప్రతిపక్షంపై విమర్శల జడివాన కురవాల్సిందే. అంతేకాదు.. ఒక్కొక్కసారి తన వారైనా సరే.. మమత ఫైర్ మామూలుగా ఉండదు. ఇప్పుడు అదే దూకుడు.. తన సొంత కేబినెట్ మంత్రి.. ఆమెకు అత్యంత ప్రియమైన నేత పార్థా ఛటర్జీపై చూపించారు. ఆయనకు జీవిత ఖైదు విధించినా సంతోషమేనని చెప్పారు. అంతేకాదు.. ఈ కేసును అత్యంత వేగంగా కొలిక్కి తేవాలని ఈడీకి సూచించారు. దీంతో దటీజ్.. మమత! అనేకామెంట్లు కురుస్తున్నాయి.
ఏం జరిగింది?
ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కుంభకోణానికి సంబంధించి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ సోదాల్లో దాదాపు 21 కోట్ల రూపాయలతో అడ్డంగా దొరికిపోయారు బెంగాల్ మంత్రి పార్థా ఛటర్జీ. సాధారణంగా ఇలాంటి కేసుల్లో సదరు నాయకులను వెనుకేసుకు వస్తారు. కానీ, మమత అలాంటి నాయకురాలు కాదు కదా.. అందుకే ఆయనపై ఆమె కన్నెర్ర చేశారు. మంత్రి అరెస్టైన రెండు రోజుల తర్వాత ఆమె తొలిసారి స్పందించారు. పార్థా ఛటర్జీ దోషిగా తేలితే జీవితఖైదు విధించినా తనకు అభ్యంతరం లేదన్నారు.
అందరూ ఒకేలా ఉండరన్న మమత, తానెప్పుడూ అవినీతిని సమర్థించబోనని చెప్పారు. వీలైనంత త్వరగా నిజం నిగ్గు తేలాలన్నారు. మంత్రి పార్థా ఛటర్జీ సహాయకురాలు, నటి, మోడల్ అర్పితా ముఖర్జీ ఇంట్లో రూ.21 కోట్ల నగదును ఈడీ స్వాధీనం చేసుకొంది. ప్రస్తుతం పరిశ్రమలు, వాణిజ్య శాఖల మంత్రిగా ఉన్న పార్థా ఛటర్జీ గతంలో విద్యామంత్రిగా పనిచేశారు. ఆ సమయంలో ఉపాధ్యాయ నియామకాల్లో అవినీతి జరిగిందనేది ఈడీ వాదన.
మరోవైపు ప్రభుత్వానికి కానీ, పార్టీకి కానీ అర్పితా ముఖర్జీతో ఎలాంటి సంబంధాలు లేవని మమత స్పష్టం చేశారు. తాను గతంలో దుర్గా పండాల్‌ను సందర్శించినప్పుడు ఒక మహిళను పార్థా చటర్జీ స్నేహితురాలని చెప్పి పరిచయం చేశారని మమత గుర్తు చేసుకున్నారు. తానేమీ దేవతను కాదని, ఎవరి స్నేహితులు ఎలాంటి వారో తనకెలా తెలుస్తుందని మమత ప్రశ్నించారు. మరోవైపు పార్థా ఛటర్జీని ఆసుపత్రిలో చేర్పించాల్సిన అవసరం లేదని కోల్‌కతా ప్రత్యేక న్యాయస్థానం తెలిపింది.
మనదగ్గర ఇలా..
మన రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ.. పలువురు మంత్రులపై అవినీతి ఆరోపణలు వచ్చాయి. దాడులు అయితే.. జరగలేదు..కానీ, ఆరోపణలు గుప్పుమన్నాయి. ఏపీలో మంత్రి గుమ్మనూరు జయరాం.. తెలంగాణలో ఓ రెడ్డి మంత్రిపై అవినీతి ఆరోపణలు వచ్చాయి. కానీ, ఈ ఇద్దరి విషయంలోనూ.. సీఎంలు కానీ.. ఇతర మంత్రులు కానీ.. మౌనం పాటించి.. అస్సలు తెలియనట్టే నటించడం గమనార్హం. ఇదీ.. మమతకు.. మిగిలిన వారికీ తేడా!! అందుకే మమత.. మమతే.. ఫైర్ .. ఫైరే అంటున్నారు పరిశీలకులు.
Gulte Telugu Telugu Political and Movie News Updates