ఏపీలో రోడ్ల దుస్థితిపై ప్రజల నుంచి ప్రతిపక్ష పార్టీల నుంచి తీవ్ర విమర్శలు వస్తున్న విషయం తెలిసిందే. అయితే.. దీనిపై ప్రభుత్వం మాత్రం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తోంది. పైగా రోడ్ల దుస్థితిని ప్రశ్నిస్తున్న ప్రతిపక్ష పార్టీ నాయకులపై ఎదురు దాడి చేయిస్తున్న విషయం తెలిసిందే. అయినప్పటికీ ప్రజల నుంచి వచ్చే విమర్శలను మాత్రం ప్రభుత్వం ఆపలేక పోతోంది. నాయకులు ఎక్కడికి వెళ్లినా.. ప్రజలు రహదారుల దుస్థితిపై నిలదీస్తున్నారు.
ప్రస్తుతం వైసీపీ నాయకులు నిర్వహిస్తున్న గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ప్రజల నుంచి వస్తున్న ప్రధాన విమర్శల్లో రహదారుల దుస్తితి కూడా ఒకటి.. రహదారులు బాగోలేదని.. తమ పరిస్థితి ఏంటని.. ప్రజలు నిలదీస్తున్నారు. ఈ నిలదీతలపై వైసీపీ మంత్రులు.. ఎమ్మెల్యేలు ఒక్కొక్క రకంగా వ్యవహరిస్తున్నారు. తాజాగా కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం.. సంచలన వ్యాఖ్యలు చేశారు. రహదారులపై ప్రశ్నించని ప్రజల విషయంలో ఆయన ఫైరయ్యారు.
“అవును.. నిజమే.. ఏడాది క్రితం శంకుస్థాపన చేసిన రోడ్డు పనులు.. ఇప్పటికీ పూర్తికాలేదు” అని స్వయాన కార్మిక మంత్రి గుమ్మనూరు జయరాం వ్యాఖ్యానించారు. అంతేకాదు.. రోడ్లు లేకపోతే.. మాత్రం నడవలేరా? అని ఎదురు ప్రశ్నించారు. కర్నూలు జిల్లా ఆస్పరి మండలం ముత్తుకూరు గ్రామంలో.. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ప్రజల నుంచి వచ్చిన వ్యతిరేకతతో ఇలా వ్యాఖ్యానించడం గమనార్హం.
“ప్రస్తుతం ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు. ఏం చేయమంటారు. అందుకే ముత్తుకూరు రోడ్డు పూర్తి కాలేదు” అని ప్రజలకు నిర్మొహమాటంగా చెప్పేశారు. ఆలూరు నియోజకవర్గంలో 40 రోడ్లు బాగా లేవని స్వయంగా చెప్పిన ఆయన ఆగస్టు 15న నిధులు వస్తాయని, పెండింగ్ పనులన్నీ పూర్తి చేస్తామని.. హామీ ఇచ్చారు. అయితే దీనిపైనా ప్రజలు ఆయనను నిలదీయడంతో గతంలో శ్రమదానం చేసుకున్నారుగా.. అంటూ.. అక్కడి నుంచి వెళ్లిపోయారు.