తెలంగాణ సీఎం కేసీఆర్.. గవర్నర్ తమిళసైల మధ్య మరింత గ్యాప్ పెరుగుతోంది. ఇప్పటికే ఈ ఇద్దరు ఒకరిపై ఒకరు అంతర్గతంగా కారాలు మిరియాలు నూరుతున్నారు. తనకు ప్రొటోకాల్ ఇవ్వడం లేదని గవ ర్నర్.. రుసరుస లాడుతున్నారు. ఇక, ఆమె గవర్నర్‌గా కాకుండా.. మోడీ ప్రభుత్వ ప్రతినిధిగా పనిచేస్తున్నా రనేది కేసీఆర్ భావన. కౌశిక్‌రెడ్డి వ్యవహారం నుంచి ఇలా.. ఇరు పక్షాల మధ్య దుమారం కొనసాగుతూనే ఉంది.
ఇక, రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రమాణ స్వీకారం సమయంలో ఒకింత కలిసినట్టు కనిపించినా.. తాజాగా జరుగుతున్న పరిణామాలను గమనిస్తే.. ఈ ఇరువురు నేతల మద్య ఉన్న వివాదాలు మరింత పెరుగుతున్నాయనే అంటున్నారు పరిశీలకులు. ఇటీవల వరద ప్రభావిత ప్రాంతాల్లో తమిళసై, కేసీఆర్ లు విడివిడిగా పర్యటించారు. వాస్తవానికి ఇలాంటి సమయాల్లో ప్రభుత్వం పని ప్రభుత్వం చేస్తుంది. గవర్నర్ ప్రభుత్వం నుంచి నివేదిక కోరే అవకాశం ఉంది.
అయితే.. నేరుగా గవర్నర్ రంగంలోకి దిగిపోయి.. భద్రాచలంలో పర్యటించడం.. వివాదానికి మరింత ఆజ్యం పోసింది. ఇక, ఇప్పుడు తాజాగా గవర్నర్ ఢిల్లీ పర్యటనలో భాగంగా.. సీఎం కేసీఆర్‌పై నిప్పులు చెరిగారనే చెప్పాలి. రాజకీయాలు మాట్లాడను అంటూనే కేసీఆర్‌పై విమర్శలు గుప్పించారు. జాతీయ రాజకీయాల్లో కేసీఆర్ ఇమడలేరని అంటూనే కేంద్రంలో కేసీఆర్ రాజకీయాలు సాగవని.. హెచ్చరించారు. క్లౌడ్ బరస్ట్ వ్యాఖ్యలను లైట్ తీసుకున్నట్టు చెప్పారు.
“నేను రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రొటోకాల్ ఆశించడం లేదు. సీఎంగా ఆయనకు ఉన్న హక్కులు ఉంటే.. నాకు గవర్నర్‌గా పర్యటించే హక్కు.. ప్రజల పక్షాన మాట్లాడే హక్కు ఉన్నాయి. క్లౌడ్ బరస్ట్ వ్యాఖ్యలపై నేను బరస్ట్ కాను. జాతీయ రాజకీయాల్లో కేసీఆర్ ఆటలు సాగవు. జాతీయ రాజకీయాల్లో గుర్తింపు కోసమే ఆయన మోడీని విమర్శిస్తున్నారు. ఈ ప్రయత్నం వృథా” అని తమిళ సై వ్యాఖ్యానించారు. దీనిని బట్టి.. ఈ రెండు పక్షాల మధ్య దూరం మరింత పెరగడం ఖాయమని అంటున్నారు పరిశీలకులు. మరి ఏం జరుగుతుందో చూడాలి.