అధికారంలో ఉన్న పార్టీ పై జనాల్లో అసంతృప్తి మొదలవ్వటం సహజం. ఏ ప్రభుత్వం కూడా నూటికి నూరుశాతం జనాలను సంతృప్తి పరచటం సాధ్యం కాదు. సంక్షేమ పథకాల లబ్దిదారుల్లో అనర్హులకు లబ్ధి అందటం, అర్హులకు అందకపోవటం లాంటివి చాలా సహజం. ఇలాంటి వాటాని ప్రభుత్వం ఎప్పటికప్పుడు క్రాస్ చెక్ చేసుకుంటే సర్దుబాట్లు చేసుకుని వెళుతుంటుంది. ఇందులో భాగంగానే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపైన కూడా జనాల్లో అసంతృప్తి మొదలైంది. మరి జరిగిన పొరబాట్లు ఏమిటి ? చేసిన తప్పులేమిటి ? వాటిని ఎలా సర్దుబాట్లుచేయాలి ?
ఇలాంటి విషయాలపై డైరెక్టుగా జనాల నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకునేందుకు గడపగడపకు వైసీపీ అనే కార్యక్రమాన్ని మొదలు పెట్టారు జగన్. ఇదే సమయంలో వచ్చె నెల 4వ తేదీ నుండి కార్యకర్తలతో జగన్ ముఖాముఖి కలవాలని కూడా డిసైడ్ అయ్యారు. ప్రతి నియోజకవర్గం నుండి 50 మంది కార్యకర్తలతో భేటీ అవ్వాలన్నది జగన్ ఆలోచన. పార్టీలో అట్టడుగున పనిచేసే కార్యకర్తలను డైరెక్టుగా కలవాలన్న జగన్ నిర్ణయం మంచిదే.
అయితే ఈ కార్యక్రమం ఎప్పుడు సక్సెస్ అవుతుంది ? ఎప్పుడంటే కార్యకర్తలు చెప్పింది విన్నపుడు మాత్రమే. సమావేశం నిర్వహించబోయేది తాను చెప్పింది కార్యకర్తలు వినటానికి కాదు. కార్యకర్తలు ఏమిచెబుతారో జగన్ వినాలి. కార్యకర్తలు చెప్పింది విన్నపుడు మాత్రమే పార్టీలో కానీ పబ్లిక్ లో కానీ సమస్యలు వాటి పరిష్కారాలు బయటపడతాయి. పార్టీ, ప్రభుత్వంపై జనాల్లో ఎలాంటి అభిప్రాయాలున్నాయన్న విషయాన్ని కార్యకర్తలు మాత్రమే చెప్పగలరు.
కాబట్టి కార్యకర్తలు చెప్పింది విని, వాళ్ళ అభిప్రాయాలకు, చెప్పిందానికి విలువ ఇచ్చి సర్దుబాట్లు చేసినపుడు మాత్రమే ఇలాంటి కార్యక్రమాల వల్ల లాభం జరుగుతుంది. అలాకాకుండా సమావేశంలో తాను చెప్పదలచుకున్నది చెప్పేసి కార్యకర్తలను క్షేత్రస్ధాయిలో పనిచేసుకోమని చెప్పి పంపేస్తే ఎలాంటి ఉపయోగం ఉండకపోగా నష్టంమాత్రం ఖాయం. కాబట్టి సరైన ఫీడ్ బ్యాక్ తెలియాలంటే జగన్ ఏమిచేస్తారో చూడాల్సిందే.