నిజంగానే ఇది ఇప్పటి వరకు దేశంలో చాలా మంది తెలియని అతి పెద్ద రహస్యం. ముఖ్యమంత్రులు, ప్రధానులు.. ఏం తినాలో.. ఎటు వైపు వెళ్లాలో.. ఎక్కడ పర్యటించాలో.. వంటివాటిని మాత్రమే అదికారులు నిర్ణయిస్తారని.. ముందుగా.. కొన్ని పదార్థాలపై టెస్టులు కూడా చేస్తారని తెలుసు. కానీ.. రాష్ట్రపతి విషయంలో వీటికి అదనంగా కూడా కొన్ని నిర్ణయాలు అధికారులే తీసుకుంటారనే విషయం.. ఇప్పుడే వెలుగు చూసింది. రాష్ట్రపతి ఏం మాట్లాడాలో.. ముందుగానే రాష్ట్రపతి భవన్ చీఫ్ సెక్రటరీ నిర్ణయం చేస్తారట.
అంతేకాదు.. రాష్ట్రపతి నుంచి కొన్ని బ్రీఫింగ్స్ తీసుకుని.. వాటిని ప్రసంగం రూపంలో మలుస్తారు. సరే.. ఇంత వరకు ఓకే. ఇక, రాష్ట్రపతి ఏం తినాలో.. ఏం తాగాలో కూడా రాష్ట్రపతి భవన్ అధికారులే నిర్ణయిస్తారు. ఈ విషయాన్ని గతంలో రాష్ట్రపతిగా చేసిన వారు కూడా బయట పెట్టారు. దీనికి అతీతంగా వ్యవహరించింది… ఒక్క కలాం మాత్రమే. ఆయన ఎక్కడికి వెళ్లినా.. ఎవరు ఏం పెట్టినా తినేవారు. నిబంధనలు అవసరం లేదు! అని మొహం మీదే చెప్పేవారు. అంతేకాదు.. ఆయన ఎక్కడికైనా పర్యటనలకు వెళ్తే.. తనకు నచ్చిన ప్రాంతానికి షెడ్యూల్‌లో లేకపోయినా వెళ్లేవారు.
కానీ, ఇప్పుడు వెలుగు చూసిన మరో సంచలన విషయం.. ప్రస్తుతం రాష్ట్రపతి గా ఎన్నికైన ద్రౌపది ముర్ము.. ఎలాంటి చీర కట్టుకోవాలో.. కూడా రాష్ట్రపతి భవన్ అధికారులే నిర్ణయిస్తారని తెలియడం. ఇదేమీ జోక్ కాదు. నిజమే. భారతదేశ 15వ రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము సోమవారం ప్రమాణస్వీకారం చేయనున్నారు. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ.. ముర్ము చేత ప్రమాణస్వీకారం చేయిస్తారు. పార్లమెంట్ సెంట్రల్ హాలులో ఉదయం 10.15 గంటలకు ఈ కార్యక్రమం జరగనుంది.
ముర్ము ప్రమాణస్వీకారం కోసం సంప్రదాయ సంతాలీ చీరను కోసం ఆమె వదిన సుక్రీ టుడూ తీసుకెళ్లారు. శనివారమే తన భర్త తరినిసేన్ టుడూ(ముర్ము సోదరుడు)తో కలిసి ఢిల్లీకి వెళ్లారు. పార్లమెంటులో జరిగే కార్యక్రమానికి వీరు హాజరుకానున్నారు. అయితే.. సుక్రీ సంచలన విషయం బయట పెట్టారు. ‘దీదీ కోసం నేను సంతాలీ చీర తీసుకెళ్తున్నా. ప్రమాణస్వీకారానికి ఈ చీర ధరిస్తుందని ఆశిస్తున్నా. నిజానికి ఆమె ఈ చీరే ధరిస్తారో లేదో తెలియదు. ఆమె కట్టుకునే చీరలపై రాష్ట్రపతి భవన్ అధికారులే నిర్ణయం తీసుకుంటారట’ అని సుక్రీ పేర్కొన్నారు.