పార్టీలోని కొందరు ప్రజా ప్రతినిధులను జగన్మోహన్ రెడ్డి పట్టించుకోవటం లేదా ? అవుననే చెబుతున్నారు పార్టీ నేతలు. కారణాలు ఏవైనా కొందరు ప్రజాప్రతినిధులు జగన్ వ్యవహారశైలితో అసంతృప్తిగా ఉన్నారు. ఇదే సమయంలో సదరు ప్రజా ప్రతినిదుల వైఖరి నచ్చక జగన్ కూడా వాళ్ళని దూరంగా పెట్టేసినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అందుకనే జగన్ కు సదరు ప్రజాప్రతినిదులకు బాగా గ్యాప్ వచ్చేసింది. దీంతో వచ్చే ఎన్నికల్లో వీళ్ళలో ఎంతమందికి జగన్ టికెట్లిస్తారో అనుమానంగా ఉంది.
జగన్ తో గ్యాప్ నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజుతో మొదలైంది. వీళ్ళద్దరి మధ్య విభేదాలకు కారణాలు సరిగా బయటకు రాలేదుకానీ గ్యాప్ అయితే వచ్చేసింది. దాంతో రఘురాజు మొదట ప్రభుత్వంపై ఆరోపణలు, విమర్శలు మొదలుపెట్టారు. తిరుగుబాటు ఎంపీగా ముద్రపడిన తనను ఎవరు పట్టించుకోవటం లేదన్న మంటతో ఏకంగా జగన్ను వ్యక్తిగతంగా టార్గెట్ చేయటం మొదలుపెట్టారు. దాంతో తర్వాత జరిగిన, ఇపుడు జరుగుతున్న పరిణామాలు అందరికీ తెలిసిందే.
తర్వాత నెల్లూరు జిల్లాలో వెంకటగిరి ఎంఎల్ఏ ఆనం రామనారాయణరెడ్డి రంగంలోకి దిగారు. తనకు మంత్రిపదవి ఇవ్వలేదని, తనకు ఎవరు సరైన ప్రాధాన్యత ఇవ్వలేదని అలిగారు. అలిగిన వారు అలాగే ఉండకుండా ప్రభుత్వంపై ఆరోపణలు, విమర్శలకు దిగారు. అయినా జగన్ పట్టించుకోకపోవటంతో పార్టీకి మెల్లిగా దూరమైపోయారు. అయితే రఘురామకృష్ణంరాజు లాగ జగన్ను వ్యక్తిగతంగా టార్గెట్ చేయలేదు.
ఇదే సమయంలో ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి కూడా ఇదే బాటపట్టారు. ప్రభుత్వం మీద తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. అంతేకానీ బాహాటంగా అయితే ఆరోపణలు, విమర్శలకు దిగలేదు. మొత్తానికి జగన్ తో గ్యాప్ వచ్చేసి పార్టీకి దూరమవుతున్నారు. ఇదే దారిలో నెల్లూరు జిల్లా కోవూరు ఎంఎల్ఏ నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి కూడా నడుస్తున్నారు. జగన్ తో గ్యాప్ వచ్చిందో లేదో స్పష్టంగా తెలీదుకానీ మంత్రి పదవి దక్కలేదన్న అసంతృప్తయితే స్పష్టంగా కనబడుతోంది. ఈ కారణంగా పార్టీతో అయితే గ్యాప్ వచ్చేసింది. తనతో ఎవరెవరికి అయితే గ్యాప్ వచ్చేసిందో వాళ్ళందరినీ జగన్ ఏమాత్రం పట్టించుకోవటం లేదన్నది వాస్తవం.
Gulte Telugu Telugu Political and Movie News Updates