టీడీపీలో మంగ‌ళ‌గిరి హాట్ టాపిక్‌!

తెలుగు దేశం పార్టీ నాయ‌కుల మ‌ధ్య ప్ర‌స్తుతం మంగ‌ళ‌గిరి నియోజ‌క‌వ‌ర్గం హాట్‌టాపిక్‌గా మారింది. చాలా మంది నాయ‌కులు ఈ నియోజ‌క‌వ‌ర్గంలో త‌ర‌చుగా ప‌ర్య‌టిస్తున్నారు. ఇక్క‌డ జ‌రుగుతున్న ప‌నుల‌ను ప‌రిశీలిస్తున్నారు. దీంతో మంగ‌ళ‌గిరి నియోజ‌క‌వ‌ర్గం కాన్సెప్ట్‌.. టీడీపీలో హాట్ టాపిక్‌గా మారిపోయింది. మ‌రి ఇంత‌కీ ఏం జ‌రిగింద‌నే విష‌యాన్ని ప‌రిశీలిస్తే.. గ‌త ఎన్నిక‌ల్లో ఇక్క‌డ నుంచి టీడీపీ యువ నాయ‌కుడు లోకేష్ పోటీ చేసి ఓడిపోయారు. అయితే.. వ‌చ్చే ఎన్నిక‌ల్లోనూ.. ఆయ‌న ఇక్క‌డ నుంచే పోటీ చేయాల‌ని నిర్ణ‌యించుకున్నారు.

అయితే.. గ‌త ఎన్నిక‌ల్లో అంటే.. కేవ‌లం ఎన్నిక‌ల‌కు కొన్ని నెల‌ల ముందు మాత్ర‌మే టికెట్ క‌న్ఫ‌ర్మ్ కావ‌డంతో మంగ‌ళ‌గిరిపై పూర్తిస్థాయిలో ప‌ట్టు సాధించేందుకు లోకేష్ కు స‌మ‌యం స‌రిపోలేద‌నే చెప్పాలి. అయిన‌ప్ప‌టికీ.. బ‌ల‌మైన పోటీ అయితే.. ఇచ్చారు. అయితే.. ఇప్పుడు ఎన్నిక‌ల‌కు ముందు హ‌ర్రీ బ‌ర్రీ కాకుండా.. నిల‌క‌డైన ప్ర‌చారంతో ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు తెలుసుకునేందుకు ఆయ‌న‌ప్రాధాన్యం ఇస్తున్నారు. ముఖ్యంగా మాస్ జ‌నాభా ఎక్కువ‌గా ఉన్న మంగ‌ళ‌గిరిలో వారిని ఆక‌ట్టుకుంటున్నారు.

మంగ‌ళ‌గిరి నియోజ‌క‌వ‌ర్గంలో మొత్తం ఓట‌ర్లు 2.4 ల‌క్ష‌లు. వీరిలో ల‌క్ష మందికిపైగా.. చిరు వ్యాపారుల కుటుంబాలే ఉన్నాయి. ఉద్యోగులు కేవ‌లం 10 శాతం మంది ఉన్నారు. మిగిలిన‌వారిలో.. వ‌స్త్ర వ్యాపారం చేసుకునేవారు ఉన్నారు. కొంద‌రు యువత కూడా ఉన్నారు. వీరిని టార్గెట్ చేయ‌డంపై లోకేష్ ముంద‌స్తు ప్ర‌ణాళిక సిద్ధం చేసుకుని ముందుకు సాగుతున్నారు. ఈ క్ర‌మంలో చిరు వ్యాపారాల‌ను ఎక్కువ‌గా త‌న‌వైపు తిప్పుకొనే ప‌నిచేస్తున్నారు.

వీరికి బండ్లు త‌యారు చేయించి ఇవ్వ‌డంతోపాటు..బ్యాంకుల నుంచి రుణాలు పొందేలా.. కూడా లోకేష్‌ సాయం చేస్తున్నారు. ఇక‌, క‌ష్టంలో ఉన్నామ‌ని ఎవ‌రైనా వ‌స్తే.. వారికి ఆయా స‌మ‌స్య‌ల‌ను బ‌ట్టి 10 వేల నుంచి రూ.25 వేల వ‌ర‌కు త‌క్ష‌ణ సాయంగా అందిస్తున్నారు. యువ‌త‌కు ప‌లు విష‌యాల్లో వారివారి ఇష్టాల మేర‌కు శిక్ష‌ణ ఇప్పిస్తున్నారు. ఎన్టీఆర్ ట్ర‌స్ట్ ఆధ్వ‌ర్యంలో యువ‌తీ యువ‌కుల‌కు.. కుట్టు మిష‌న్లు.. చేతివృత్తుల్లో శిక్ష‌ణ ఇస్తున్నారు.

దీంతో ఇక్క‌డ క్షేత్ర‌స్తాయిలో లోకేష్ పేరు మార్మోగుతోంది. ఈ విష‌యంలో ఇటీవ‌ల జ‌రిగిన మ‌హానాడులో ప్ర‌స్తావ‌న‌కువ చ్చింది. దీంతో కీల‌క నాయ‌కులు త‌ర‌చుగా ఇక్క‌డ ప‌ర్య‌టిస్తూ.. మంగ‌ళగిరిని మోడ‌ల్‌గా తీసుకుని నియోజ‌క‌వ‌ర్గాల్లో ప‌నిచేయాల‌ని నాయ‌కుల‌కు దిశానిర్దేశం చేస్తున్నారు.