అవును.. ఇప్పుడు సరికొత్త చర్చకు జనసేన తెరదీసింది. తాజాగా గోదావరి జిల్లాల్లో పర్యటించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభలో సుదీర్ఘ ఉపన్యాసం ఇచ్చారు. ఈ క్రమంలో వైసీపీ సర్కారపై విమర్శలు చేశారు. ప్రజలకు మేలు చేయాలంటే.. మేలు కావాలంటే.. తమ ను ఎన్నుకోవాలని.. ఆయన సూచించారు. ఇక, ఇదే సమయంలో పవన్ కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన పార్టీని విలీనం చేయాలని.. ప్రతిపాదనలు వచ్చినట్టు చెప్పారు.
తాను ప్రాణం ఉన్నంత వరకు.. విలీనం చేసే ప్రసక్తి లేదని.. పోరాటం చేస్తామని.. గెలిచినా.. ఓడినా.. ప్రజలతోనే ఉంటామని.. పవన్ చెప్పుకొచ్చారు. విలీనం అనే మాటే ఉత్పన్నం కాదని అన్నారు. అయితే.. ఇక్కడే కొన్ని సందేహాలు వస్తున్నాయి. అసలు పవన్‌ను పార్టీ విలీనం చేయమని ఎవరు అడిగారు? ఎందుకు అడిగారు? అనేది ఒకటి. ఒకవేళ అడిగి ఉంటే.. బీజేపీనే అడిగి ఉండాలి. కానీ, వాస్తవానికి ఆ పార్టీ అలా అడిగే అవకాశం లేదు. ఎందుకంటే.. గెలిచిన వారిని తీసుకోవడమే ఆ పార్టీకి తెలుసు.
అంతేతప్ప.. ఒక్కొక్క మెట్టు ఎక్కి.. పార్టీని డెవలప్ చేసే అవకాశం ఆ పార్టీకి లేదు. తనలో ఎన్ని పార్టీలు కలిసినా.. ఏపీలో పుంజుకోవడం బీజేపీకి చాలా కష్టం. ఈ నేపథ్యంలో అసలు ప్రజల్లో పెద్దగా ఓటింగ్ లేని జనసేనను కలుపుకొని ముందుకు వెళ్లాలని బీజేపీ అనుకుంటుందా? అనేది ప్రశ్న. మరో రీజన్.. అసలు ఎవరైనా.. ఒక పార్టీని విలీనం చేసుకునేందుకు ముందుకు వచ్చారంటే.. ఆ పార్టీకి.. అంతో ఇంతో.. ఓటింగ్ ఉండాలి. అదేసమయంలో ప్రజా ప్రతినిధుల బలం కూడా ఉండాలి.
ఈ రెండు పరంగా చూస్తే.. జనసేనకు ఉన్న ఓటు బ్యాంకు 5 శాతం లోపే. కొన్ని జిల్లాల్లో అయితే.. అది కూడా లేదు. నాయకుల పరంగా చూసుకున్నా.. బలమైన నాయకులు పార్టీకి లేకుండా పోయారు. ఇక, గెలిచిన ఒక్క ఎమ్మెల్యే కూడా తన దారి తాను చూసుకున్నారు. అంటే.. మొత్తానికి జనసేన పార్టీ తాను ఊహించుకుంటున్న స్థాయిలో అయితే లేదు. మరి అలాంటప్పుడు.. ఈ పార్టీని ఎవరు మాత్రం భుజాన వేసుకుంటారు? అనేది ప్రశ్న. ప్రస్తుతం పవన్ చేసిన వ్యాఖ్యలు కేవలం.. కార్యకర్తల్లో ఒకింత ధైర్యం నింపేందుకేనని ఆ కోణంలోనే ఆయన వ్యాఖ్యానించి ఉంటారని అంటున్నారు పరిశీలకులు.
Gulte Telugu Telugu Political and Movie News Updates