తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ అంతకంతకూ బలపడుతోందని.. అధికార టీఆర్ఎస్ కు ఎదురుదెబ్బలు మొదలైనట్లేనన్న వాదన అంతకంతకకూ పెరుగుతున్న వేళ.. దానికి సాక్ష్యంగా ఇటీవల విడుదలైన సర్వేలు చెబుతున్న వేళ.. అనూహ్యంగా ఆ పార్టీకి చెందిన ఫైర్ బ్రాండ్ నేత ఎంపీ ధర్మపురి అర్వింద్ వాహనం మీద దాడి జరిగిన వైనం షాకింగ్ గా మారింది. ఎందుకిలా జరిగింది? ఎవరు చేశారు? ఎక్కడ చేశారు? దాడి చేసే వరకు విషయం ఎందుకు వెళ్లింది? లాంటి ప్రశ్నలకు సమాధానాలు వెతికితే.. కొత్త అంశాలు వెలుగు చూశాయి.
జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం ఎర్దండిలో గోదావరి ముంపును పరిశీలించటానికి ఎంపీ అర్వింద్ బయలుదేరి వెళ్లారు. ఆయన ప్రయాణిస్తున్న కారును.. కాన్వాయ్ ను గ్రామస్థులు అడ్డుకున్నారు. గ్రామానికి సంబంధించిన భూ వివాదం పరిష్కరించకుండా రావటాన్ని తప్పు పట్టారు. సమస్యను పరిష్కరించిన తర్వాత రావాలంటూ మండిపడ్డారు. ఈ సందర్భంగా కాస్తంత వాగ్వాదం చోటు చేసుకుంది. విషయం తెలుసుకున్న పోలీసులు ఎంట్రీ ఇవ్వటం.. నిలదీసిన వారిని పక్కకు పంపిన పోలీసుల కారణంగా అర్వింద్ వాహనం ముందుకు వెళ్లిపోయింది. ముంపు ప్రాంతాల్ని పరిశీలించటానికి అర్వింద్ వెళ్లిపోయారు.
ఇంతవరకు బాగానే ఉన్నా.. ఇక్కడే తేడా కొట్టింది. తమ నేతను అడ్డుకోవటం.. నిలదీయటాన్ని సహించలేని బీజేపీ కార్యకర్తలు.. ఎంపీ అర్వింద్ ఫాలోవర్సు.. గ్రామస్తులతో గొడవకు దిగారు. దీంతో.. పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఇదిలా ఉంటే.. ముంపు ప్రాంతాన్నిపరిశీలించటానికి ఎంపీ అర్వింద్ వెళ్లిన వేళలో.. అక్కడ స్థానికులపై బీజేపీ కార్యకర్తలు ప్రశ్నించి.. వారిపై గుస్సా చూపించినట్లుగాచెబుతున్నారు.
అయితే.. ఈ వివరాలు తెలీని ఎంపీ అర్వింద్ గ్రామం మీదుగా తిరిగి వచ్చారు. ఈ సందర్భంగా పలువురు గ్రామస్తులు ఎంపీ ధర్మపురి అరవింద్ ను ప్రశ్నించారు. నెలల గడిచిపోతున్నా.. తమసమస్యకు పరిష్కారం లభించటం లేదన్న ఆగ్రహానికి గురయ్యారు. ఈ సందర్భంగా ఉద్రిక్తత పెరిగింది. దీంతో మరోసారి పోలీసులు ఎంట్రీ ఇచ్చారు. కాన్వాయ్ కు అడ్డు వచ్చిన గ్రామస్థులు తప్పించి అర్వింద్ కాన్వాయ్ ను ముందుకు తీసుకెళ్లారు. దీంతో ఆగ్రహానికి గురైన గ్రామస్థులు ఎంపీ కాన్వాయ్ మీద దాడి చేశారు.
ఈ క్రమంలో రెండు కార్ల అద్దాలు ధ్వంసమయ్యాయి. దీంతో స్థానికంగా ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. బీజేపీ కార్యకర్తల తీరుపై కినుకు వహించిన గ్రామస్థులు కర్రలు.. రాళ్లతో దాడి చేసినట్లుగా చెబుతున్నారు. మొత్తానికి తెలంగాణలో బీజేపీ బలం అంతకంతకూ ఎక్కువ అవుతుందన్న వేళలో.. ఇలాంటి పరిణామాలు చోటు చేసుకోవటం అంత మంచి శకునం కాదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.