దేశంలో మరెక్కడా లేని రీతిలో గ్రామ.. వార్డు సచివాలయాల కాన్సెప్టును తీసుకొచ్చిన జగన్ ప్రభుత్వం.. దాన్ని పూర్తిగా పాలనా రథాన్ని పరుగులు తీయించేందుకు వినియోగిస్తే.. ఇదో చక్కటి కార్యక్రమంగా మారటమే కాదు.. పౌరసేవల లభ్యత అంశం మెరుగుపడటమే కాదు.. దేశానికో చక్కటి మోడల్ లభించేది. కానీ.. వాలంటీర్లతో పాలనా పనులతో పాటు రాజకీయ అంశాల్ని కూడా చేయించాలన్న అప్రకటిత ఎజెండా పుణ్యమా అని.. ఈ వ్యవస్థపై వచ్చిన ఆరోపణలు అన్ని ఇన్ని కావు.
ఈ వ్యవస్థను ఆయుధంగా చేసుకొని ఎన్నికల్లో ‘కీ’ రోల్ ప్లే చేయాలని ఏపీలోని జగన్ సర్కారు ఆలోచిస్తుందన్న ఆరోపణల్ని విపక్షాలు పెద్ద ఎత్తున చేస్తున్న వైనం తెలిసిందే. వాలంటీర్ల వ్యవస్థపై పెద్ద ఎత్తున ఆరోపణల్ని ఏపీ ఎన్నికల సంఘానికి సమర్పించిన నేపథ్యంలో తాజాగా కీలక ఆదేశాల్ని ప్రకటించారు. వాలంటీర్లు ఎవరైనా సరే.. ఎన్నికలకు సంబంధించిన అన్ని రకాల విధుల నుంచి దూరంగా ఉంచాలని ఆదేశించింది. దీనికి కారణం వైసీపీ నేతలే. ఎక్కడిదాకానో ఎందుకు మూడేళ్ల క్రితం అంటే.. 2019 ఆగస్టు 12న విశాఖలో జరిగిన వైసీపీ సోషల్ మీడియా సమావేశంలో పార్టీ కీలక నేత.. రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి మాట్లాడుతూ.. వైసీపీలో పని చేసిన వారికి వాలంటీర్ల నియామకంలో అవకాశం కల్పించి చర్యలు చేపట్టినట్లుగా పేర్కొన్నారు.
అయితే.. సోషల్ మీడియా విభాగంలో పని చేసే కార్యకర్తలకు వాలంటీర్ల నియామకంలో రిజర్వేషన్లు ఇవ్వాలంటూ అడగటంతో.. అలాంటి అధికారిక ఉత్తర్వులు ఇవ్వలేమని.. ఆవిషయాన్ని అర్థం చేసుకోవాలని విజయసాయి అప్పట్లో పేర్కొన్నారు. అంతేకాదు.. పార్టీ కోసం కష్టపడిన వారిని ఎలాంటి అవకాశం కల్పించాలనేది పార్టీ చూసుకుంటుందన్న ఆయన తరహాలోనే మరికొందరు నేతలు ఓపెన్ గానే వాలంటీర్లు పార్టీకి చెందిన వారన్న వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు.. వాటికి సంబంధించిన ఆధారాలతో విపక్షాలు ఎన్నికల సంఘాన్ని సంప్రదించాయి. ఈ నేపథ్యంలో తాజా ఉత్తర్వులు వెలువడ్డాయి.
అంతేకాదు.. వాలంటీర్లు ఎవరూ కూడా ఏ అభ్యర్థి తరఫున పోలింగ్ ఏజెంట్లుగా వ్యవహరించకూడదని స్పష్టం చేస్తూ అన్ని జిల్లాల ఎన్నికల అధికారులకు ఆదేశాల్ని జారీ చేశారు ఏపీ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేశ్ కుమార్ మీనా. వాలంటీర్లుగా వైసీపీ కార్యకర్తలే ఉన్నారని.. ఆ పార్టీ నేతలు.. మంత్రులే స్వయంగా ఈ విషయాన్ని అనేక సందర్భాల్లో వెల్లడించిన వైనాన్ని పేర్కొంటూ తమ ఫిర్యాదులతో జత చేశారు.
ఓటర్ల నమోదు.. తొలగింపు.. చేర్పులు.. మార్పులు.. ఓటర్ల జాబితా ప్రచురణ.. పోలింగ్ కేంద్రాల ఎంపిక.. ఎన్నికల రోజు ఓటరు చీటీల పంపిణీ.. పోలింగ్ ఏర్పాట్లు.. పోలింగ్ విధులు.. ఓట్ల లెక్కింపు వంటి ఎన్నికలకు సంబంధించిన ఏ విధుల్లోనూ వాలంటీర్లు ఎట్టి పరిస్థితుల్లోనూ పాల్గొనకూడదని స్పష్టం చేసింది. ఎన్నికల రిటర్నింగ్.. సహాయ రిటర్నింగ్ అధికారులు ఎవరూ కూడా వాలంటీర్లకు ఎలాంటి ఎన్నికల విధుల్ని అప్పగించకూడదని స్పష్టం చేసింది. ఈ ఉత్తర్వులు జగన్ అండ్ కోకు ఇబ్బందికరంగా మారే అవకాశం ఉందన్న మాట వినిపిస్తోంది.