పార్లమెంటులో అధికార, విపక్ష సభ్యుల మధ్య తిట్ల దండకం ఇక కుదరదు. ఒకరిపై ఒకరు దారుణాతి దారుణంగా దూషణలు కొనసాగిస్తామంటే.. వీలు కాదు. ఈ మేరకు పార్లమెంటు కొన్ని నిబంధనలు తీసుకువచ్చింది. పార్లమెంట్ సమావేశాల సందర్భంగా అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం సర్వసాధారణం. ఈ క్రమంలో కొన్నిసార్లు సభ్యులు పదునైన పదజాలాన్ని ఉపయోగిస్తుంటారు. అయితే, పార్లమెంట్ నిబంధనల ప్రకారం కొన్ని పదాలను సభలో ఉపయోగించడంపై నిషేధం ఉంటుంది.
ఇందుకు సంబంధించి లోక్‌సభ సెక్రటేరియెట్ తాజాగా ఓ కొత్త బుక్‌లెట్ విడుదల చేసింది. ఇకపై ‘జుమ్లాజీవి’, ‘కొవిడ్ స్ప్రెడర్’, ‘స్నూప్ గేట్’ వంటి పదాలను పార్లమెంట్‌లో వాడటం నిషిద్ధం. దీంతో పాటు అతి సాధారణంగా ఉపయోగించే ‘సిగ్గు చేటు’, ‘వేధించడం’, ‘మోసగించడం’, ‘అవినీతిపరుడు’, ‘డ్రామా’, ‘హిపోక్రసీ’, ‘నియంత’ అనే పదాలను కూడా ఉపయోగించకూడదని బుక్‌లెట్‌లో పేర్కొనడం గమనార్హం.
జులై 18 నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్న తరుణంలో నిషేధిత పదాల జాబితాను లోక్‌సభ విడుదల చేసింది. తాజా జాబితా ప్రకారం.. ‘శకుని,
తానీషా’, ‘వినాశ పురుష్’, ‘ఖలిస్థానీ’, ‘ద్రోహ చరిత్ర’, ‘చంచా’, ‘చంచాగిరి’, ‘పిరికివాడు’, ‘క్రిమినల్’, ‘మొసలి కన్నీళ్లు’, ‘గాడిద’, ‘అసమర్థుడు’, ‘గూండాలు’, ‘అహంకారి’, ‘చీకటి రోజులు’, ‘దాదాగిరి’, ‘లైంగిక వేధింపులు’, ‘విశ్వాసఘాతకుడు’ వంటి పదాలను కూడా సభ్యులు తమ ప్రసంగంలో ఉపయోగించకూడదు.
సమయానుకూలంగా కొన్ని పదాలు, హావభావాలను పార్లమెంట్ ఉభయ సభలు, రాష్ట్రాల చట్టసభల్లో వినియోగించకుండా వాటిని అమర్యాదకరమైనవిగా ప్రకటిస్తుంటారు. రాజ్యసభ ఛైర్మన్, లోక్‌సభ స్పీకర్ వీటిపై తుది నిర్ణయం తీసుకుంటారు. ఒకవేళ నిషేధిత జాబితాలో ఉన్న పదాలను సభ్యులు ఉపయోగిస్తే వాటిని రికార్డుల నుంచి తొలగిస్తారు.
నేను తిడతా.. ఏం పీకుతారు?!
లోక్‌సభ సెక్రటేరియట్ విడుదల చేసిన తాజా జాబితాపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అత్యంత సాధారణంగా ఉపయోగించే పదాలను కూడా మాట్లాడొద్దని చెప్పడం సరికాదంటూ టీఎంసీ ఎంపీ డెరెక్ ఒబ్రెయిన్ మండిపడ్డారు. తాను వాటిని ఉపయోగిస్తానని, ఏం పీకుతారో పీక్కోండని వ్యాఖ్యానించారు. అంతేకాదు.. అవసరమైతే సస్పెండ్ చేసుకోవచ్చని సవాల్ చేశారు.
”మరికొద్ది రోజుల్లో శాసనసభ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఎంపీలపై ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఇక నుంచి మేం ప్రసంగించేటప్పుడు సిగ్గుచేటు, వేధింపులు, మోసం, అవినీతి, అసమర్థుడనే సాధారణ పదాలను కూడా వాడకూడదంట. నేను ఆ పదాలను ఉపయోగిస్తాను. కావాలంటే సస్పెండ్ చేయండి. ప్రజాస్వామ్యం కోసం పోరాడతా” అని ఓబ్రెయిన్ ట్విటర్‌లో రాసుకొచ్చారు.