బీజేపీకి కిక్కిచ్చే విషయమేనా ?

షెడ్యూల్ ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ తెలంగాణలో అనేక సంస్థలు సర్వేలు చేస్తున్నాయి. అలాంటి సర్వేలో ఆరా అనే సంస్థ కూడా ఒకటుంది. ఈ సంస్ధ తెలంగాణా వ్యాప్తంగా నిర్వహించిన సర్వేలో బీజేపీకి మాంచి కిక్కిచ్చే విషయం బయటపడింది. అదేమిటంటే అధికారంలోకి వస్తుందో లేదో స్పష్టంగా తెలీదుకానీ ఓట్ల శాతాన్ని మాత్రం గణనీయంగా పెంచుకుంటుందట.

ఇంతకీ సర్వేలో ఏమి తేలిందంటే టీఆర్ఎస్ కు 38.88 శాతం ఓట్లు వస్తాయట. బీజేపీ 30.48 శాతం ఓట్లు దక్కించుకుంటుందని తేలిందట. ఇక కాంగ్రెస్ పార్టీకి 23.71 శాతం ఓట్లు వస్తాయని సర్వేలో తేలిందట. 2018 ఎన్నికల్లో టీఆర్ఎస్ కు 46.9 శాతం ఓట్లొచ్చాయి. కాంగ్రెస్ కు 28.4 శాతం ఓట్లు వస్తే బీజేపీకి 7.1 శాతం ఓట్లుచ్చాయి. అంటే సర్వే ప్రకారం టీఆర్ఎస్, కాంగ్రెస్ కు 2018 ఎన్నికల్లో వచ్చిన ఓట్లకన్నా ఇప్పటి సర్వేలో ఓట్లశాతం బాగా తగ్గిపోతున్నట్లు బయటపడింది.

ఇదే సమయంలో బీజేపీ మాత్రం 7.1 శాతం నుండి 30 శాతానికి ఓట్ల శాతాన్ని పెంచుకుంటోంది. ఓట్ల శాతం 7 నుండి 30 శాతానికి పెరగటమంటే మామూలు విషయం కాదు. అసలు బీజేపీకి 23 శాతం ఓట్లు ఎందుకు పెరిగింది ? బీజేపీపై జనాల్లో ప్రేమ పెరిగిపోయిందా లేదా టీఆర్ఎస్, కాంగ్రెస్ పై విరక్తి వచ్చేసిందా ? కేసీయార్ మీద జనాల్లో బాగా పెరిగిపోతోందనే విషయం తెలుస్తోంది. ఇదే సమయంలో కాంగ్రెస్ పైన కూడా జనాల్లో సానుకూలత పెరుగుతోందనే చర్చ కూడా జరుగుతోంది.

ఇలాంటి సమయంలో ఆరా చేసిన సర్వే ఫలితాలు మాత్రం కాస్త విచిత్రంగానే ఉంది. ఏ ఎన్నికలో అయినా ఏ పార్టీకైనా ఒకటి, రెండు శాతం ఓట్లు అటు ఇటు అవటం మామూలే. కానీ టీఆర్ఎస్ కు 8 శాతం ఓట్లు తగ్గుతాయని, కాంగ్రెస్ కు 5 శాతం ఓట్లు తగ్గుతాయని తేలిందట. సరే ఈ రెండుపార్టీలకు తగ్గిన 13 శాతం ఓట్లు బీజేపీకి పడతాయని అనుకున్నా ఏమోలే అనుకోవవచ్చు. కానీ బీజేపీకి ఏకంగా 23 శాతం ఓట్లు పెరగటమంటే అంతగా నమ్మబుద్ది కావటంలేదు. ఏదేమైనా బీజేపీకైతే మాంచి కిక్కేచ్చే వార్తనే చెప్పాలి.