పెద్ద జోక్ వేసిన పురందేశ్వరి

బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పెద్ద జోక్ చేశారు. ఇంతకీ ఆ జోక్ ఏమిటంటే వచ్చే ఎన్నికల్లో 175కి 175 అసెంబ్లీ సీట్లలో గెలవటమే టార్గెట్ గా పెట్టుకున్నారట. 175 సీట్లలో గెలవటాన్ని జగన్మోహన్ రెడ్డి టార్గెట్ గా పెట్టుకున్న విషయం తెలిసిందే. జగన్ టార్గెట్ గా పెట్టుకోంగా లేనిది తాము మాత్రం ఎందుకు పెట్టుకోకూడదని పురందేశ్వరి అడగటం జోక్ కాక మరేమిటి ? అసలు వైసీపీకి బీజేపీకి ఎందులో అయినా పోలికుందా ?

ఇపుడే కాదు ప్రతిపక్షంలో ఉన్నపుడు కూడా వైసీపీ బలంగానే ఉంది. పార్టీ పెట్టిన తర్వాత పాల్గొన్న మొదటి సార్వత్రిక ఎన్నికల్లోనే వైసీపీ 67 అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటు ఎనిమిది పార్లమెంటు నియోజకవర్గాల్లో గెలిచింది. ఇక గ్రామ స్ధాయితో పాటు రాష్ట్రస్థాయిలో బలమైన నాయకత్వం ఉంది. కాబట్టే వైసీపీ బలం 67 సీట్లు నుంచి ఏకంగా 151 సీట్లకు పెరిగింది. వైసీపీ 151 సీట్లు గెలుచుకోవటానికి అనేక కారణాలున్నాయి. మరి బీజేపీ ఒక్క సీటు గెలుచుకోవటానికి తగిన కారణాన్ని పురందేశ్వరి చూపగలరా ?

నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి రాష్ట్ర ప్రయోజనాలను తుంగలో తొక్కేస్తున్నారు. విభజన చట్టాలకు తూట్లు పొడొచేయటమే కాకుండా చివరకు విశాఖపట్నం స్టీల్ ఫ్యాక్టరీని కూడా ప్రైవేటుపరం చేసేస్తున్నారు. మోడీ సర్కార్ వల్ల ఏపీకి ఇంత అన్యాయం జరుగుతున్నా పురందేశ్వరితో కలిపి నేతలెవ్వరు కేంద్రాన్ని నిలదీయలేకపోతున్నారు. అందుకనే 2019 ఎన్నికల్లో కనీసం ఒక్క సీటులో కూడా డిపాజిట్ రాలేదు. తర్వాత జరిగిన మూడు ఉపఎన్నికల్లో కూడా డిపాజిట్లు దక్కలేదు.

రేపటి జనరల్ ఎలక్షన్స్ లో కూడా ఒక్కచోట కూడా బీజేపీ అభ్యర్ధులకు డిపాజిట్ వస్తుందని గ్యారెంటీలేదు. అసలు 175 నియోజకవర్గాల్లో గట్టి అభ్యర్ధులను పోటీలోకి దించేంత సీన్ కూడా లేదు. ఇలాంటి పార్టీ 175 సీట్లలో గెలవటం టార్గెట్ గా పెట్టుకున్నట్లు పురందేశ్వరి చెబితే నవ్వు రాకుండా ఉంటుందా.