వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ, జనసేన ఏకమవుతాయా ? ఈ విషయంపై క్లారిటీ రావటానికి ఇంకాస్త సమయం పడుతుంది. అయితే ఇప్పుడే ఏకమవ్వటం ఏమిటి ? ఏమిటంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా డిజిటల్ ప్రచారంలో మాత్రం ఏకమయ్యాయనే చెప్పాలి. రాష్ట్రంలోని రోడ్ల పరిస్థితిపై రెండు పార్టీలు ఏకకాలంలో నిరసన కార్యక్రమాలు, వ్యతిరేక ప్రచారం చేయాలని అనుకోవటమే విచిత్రంగా ఉంది.
రెండు పార్టీలు ఒకేసారి ఒకే అంశంపై ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు మొదలు పెట్టడమే ఆశ్చర్యంగా ఉంది. 15, 16, 17 తేదీల్లో గుడ్ మార్నింగ్ సీఎం సర్ అనే హ్యాష్ ట్యాగ్ తో రోడ్ల వాస్తవ పరిస్థితిపై డిజిటల్ రూపంలో నిరసనలు తెలపాలని జనసేన ముందుగానే నిర్ణయించింది. రోడ్ల పరిస్ధితిని ఫోటోలు, వీడియోలు తీసి వాటన్నింటినీ ట్విట్టర్ రూపంలో జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్ళాలని జనసేన పిలుపిచ్చింది.
గతంలో కూడా ఇదే అంశంపై జనసేన రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలను నిర్వహించిన విషయం గుర్తుండే ఉంటుంది. కాకపోతే ఇపుడు డిజిటల్ రూపంలో నిరసనలు తెలియజేయబోతోందంతే. ఇదే సమయంలో ఇదే అంశంపై తెలుగుదేశం పార్టీ కూడా నిరసనలు మొదలుపెట్టబోతోంది. ‘చెత్తరోడ్లు-చెత్తముఖ్యమంత్రి’ అనే ట్యాగ్ లైనుతో నిరసనలు మొదలుపెట్టింది. దీన్ని కూడా టీడీపీ అనుబంధ విభాగం ఐ-టీడీపీ డిజిటల్ రూపంలో మొదలుపెడుతోంది.
మొత్తానికి రెండు పార్టీలు జాయింట్ గా నిరసనలు తెలపటం లేదు కానీ ఒకే అంశంపై ఏకకాలంలో ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తుండటమే ఆశ్చర్యంగా ఉంది. గతంలో ఎప్పుడూ ఇలా ఏకకాలంలో రెండు పార్టీలు నిరసనలు తెలిపిన దాఖలాలు లేవు. బహుశా ఇదే పద్దతి భవిష్యత్తులో పునరావృతమవుతుందేమో తెలీదు. షెడ్యూల్ ఎన్నికలకు ఇంకా రెండేళ్ళుంది. బీజేపీ-జనసేన పార్టీలు విడిపోవటం ఖాయమనే ప్రచారం పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలోనే రెండు పార్టీలు ఒకేసారి మొదలుపెట్టబోతున్న నిరసనలు కాకతాళీయమా లేదా వ్యూహాత్మకమా అన్న విషయంపైనే క్లారిటి రావటం లేదు. చూద్దాం నాలుగు రోజులు ఆగితే ఏ విషయం బయటపడకుండా ఉంటుందా ?
Gulte Telugu Telugu Political and Movie News Updates