ఏపీ రాజ‌కీయాల్లో అంద‌రూ మోడీ దాసులేగా…!

ఎందుకో.. ఏమిటో.. కానీ, ఇప్పుడు సోష‌ల్ మీడియాలో ఇదే మాట వినిపిస్తోంది. ‘ఏపీలో అంద‌రూ దామోదర దాసులే బ్రో అనే మాట జోరుగా వినిపిస్తోంది. దీంతో ఇది ఆస‌క్తిక‌ర చ‌ర్చ‌కు కూడా దారితీస్తోంది. ఇంత‌కీ దామోద‌ర దాస్ ఎవ‌రు? అంటే.. మ‌న ప్ర‌ధాన న‌రేంద్ర మోడీ. ఆయ‌న అస‌లు పేరు న‌రేంద్ర దామోద‌ర్ దాస్ మోడీ. మోడీ ఆయ‌న ఇంటి పేరు, దామోద‌ర్ దాస్ ఆయ‌న తండ్రిపేరు. అస‌లు పేరు న‌రేంద్ర‌. వెర‌సి న‌రేంద్ర దామోద‌ర్‌దాస్ మోడీ.. పూర్తి పేరు.

సో.. ఏపీలో మారిన రాజ‌కీయాల‌ను ప‌రిశీలిస్తున్న నెటిజ‌న్లు.. మోడీకి అంద‌రూ దాసులే బ్రో అనే మాట‌నే అంటున్నారు. ఉన్న‌ట్టుండి అనూహ్యంగా ఏపీలో రాజ‌కీయాలు మారిపోయాయి. నిన్న మొన్న‌టి వ‌ర‌కు టీడీపీతో విభేదించిన బీజేపీ నాయ‌కులు.. ఒకే వేదిక పంచుకున్నారు. ప‌క్క‌న ప‌క్క‌న కూర్చున్నారు. ఇక‌, రాష్ట్ర‌ప‌తి అభ్య‌ర్థికి క‌ట్టగ‌ట్టుకుని.. వైసీపీ టీడీపీలు మ‌ద్ద‌తు ప్ర‌క‌టించాయి. ఈ ప‌రిణామాలు రాత్రికి రాత్రి జ‌రిగిపోలేదు. చాలా వ్యూహాత్మ‌కంగానే జ‌రిగాయ‌ని అంటున్నారు.

నిజానికి ఇలాంటి విష‌యాల్లో మ‌ద్ద‌తు ఇచ్చేముందు.. స్వ‌ప్ర‌యోజ‌నం అయినా.. చూడాలి. రాష్ట్ర ప్ర‌యోజనాల‌కైనా క‌ట్టుబడి ఉండాలి. కానీ, ఇక్క‌డ రాష్ట్ర ప్ర‌యోజ‌నం క‌న్నా.. వైసీపీ కానీ… టీడీపీ.. త‌మ రాజ‌కీయ వ్యూహాల‌కు మాత్ర‌మే ప‌దును పెంచి.. మోడీని మ‌చ్చిక చేసుకునేందుకు ప్ర‌య‌త్నించాయ‌నే వాద‌న వినిపిస్తోంది. రాజ‌కీయంగా వ‌చ్చే ఎన్నిక‌ల్లో త‌మ‌కు స‌హ‌క‌రించాల‌నేది వ్యూహం. అయితే.. దీనికి మోడీ స‌హ‌క‌రించాలంటే.. ఆయ‌న‌కు స‌హ‌కారం అందించాలి.

ఇదే ఇప్పుడు ఏపీలో ఎలాంటి బేష‌ర‌తులు లేకుండా.. అధికార ప్ర‌తిప‌క్షాలు.. గుండుగుత్తుగా .. బీజేపీ అభ్యర్థికి మ‌ద్ద‌తు తెలిపాయి. అయితే.. ఇప్పుడు బీజేపీ ఏం చేస్తుంద‌నేది చూడాలి. ఎందుకంటే.. వ‌చ్చే ఎన్నిక ల నాటికి వైసీపీకి అనుకూలంగా ఉంటుందా? టీడీపీకి అనుకూలంగా మారుతుందా? అనేది ఆస‌క్తిగా మారింది. ఎలాగంటే.. ఈ రెండు పార్టీలూ కూడా బీజేపీకి మ‌ద్ద‌తిచ్చాయి. కానీ ఈ రెండు పార్టీలు వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఢీ అంటే ఢీ అనుకునేందుకు ఇప్ప‌టి నుంచే రెడీ అయ్యాయి. మ‌రి బీజేపీ ఎలా వ్య‌వ‌హ‌రిస్తుందో చూడాలి. ఇప్ప‌టికైతే.. దామోదాస్‌కు అంద‌రూ.. సాగిల‌ప‌డ్డార‌నే కామెంట్లు వినిపిస్తున్నాయి.