ఏపీలో వైసీపీ ప్రభుత్వానికి పెద్ద ఇబ్బందే వచ్చింది. ముప్పేట చుట్టుముట్టిన రాజకీయ విమర్శలు ఒకవైపు.. ప్రజల్లోకి వెళ్లి గెలుపు గుర్రం ఎక్కాల్సిన అవసరం ఇంకో వైపు.. నాయకులను ఉక్కిరిబిక్కిరికి గురి చేస్తోంది. ఈ క్రమంలో పార్టీ అధినేత, ముఖ్యమంత్రి జగన్ మాత్రం.. పథకాలనే తాను నమ్ముతున్నానని.. నవరత్నాల ను మించిన పథకాలు లేనేలేవని.. చెబుతున్నారు. నవరత్నాలతోనే గెలిచాం.. మళ్లీ వాటితోనే గెలుస్తున్నాం.. అని ఆయన స్పష్టం చేస్తున్నారు.
కానీ, క్షేత్రస్థాయి నాయకుల్లో మాత్రం.. ఎవరూ మాత్రం వీటిపై ఆశలు పెట్టుకున్నట్టు కనిపించడం లేదు. ఎందుకంటే.. పథకాలు కొందరికే చేరుతున్నాయి. పైగా.. గత ఏడాది తీసుకున్న వారికి ఈ ఏడాది లేకుండా పోయాయి. వారిని అనర్హుల జాబితాలో చేర్చేశారు. పైగా.. పథకాలు తీసుకున్నవారు అసలు ఓట్లు వేయకపో తే.. తీసుకోని వారు.. అనర్హులైన వారితో యాంటి ఓటింగ్ పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుందని లెక్కలు వేస్తున్నారు.
దీనికితోడు.. ఇప్పటికే.. పథకాల అమలులో ప్రభుత్వం వేస్తున్న పిల్లి మొగ్గలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. నిధులు సరిపోక.. అప్పులు చేయడం.. అప్పులు కూడా పుట్టే పరిస్థితి లేకపోవడం.. వంటి కారణాలతో అనర్హుల సంఖ్య పెరిగిపోతేందనే టాక్ వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో పథకాలు.. ఏమేరకు తమను రక్షిస్తాయో తెలియని పరిస్థితిలో నాయకులు కూరుకుపోయారు. వచ్చే ఎన్నికల్లో ప్రజలకు ఎలాంటి సందేశం ఇవ్వాలనేది నాయకులకు తర్జన భర్జన గా మారిపోయింది.
పోనీ.. అభివృద్ధి అయినా.. చేస్తే.. దానిని చెప్పుకొని ఎన్నికల్లోకి వెళ్లే అవకాశం ఉంటుంది. లేకపోతే.. ఇబ్బందులు తప్పేలా లేవని చెబుతున్నారు. అదేసమయంలో ప్రజల్లో విశ్వాసం మరింత పెంచాల్సిన అవసరం ఉందని.. ప్రతిపక్షాలు చేస్తున్న ప్రచారం జోరుగా సాగుతోందని మెజారిటీ వైసీపీ నాయకులు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఏం చేస్తుంది? అధినేత ఎలా రియాక్ట్ అవుతారు? అనే విషయాలు ఆసక్తిగా మారాయి. మరి ఏం చేస్తారో చూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates