కృష్ణాజిల్లా వైసీపీలో నలుగురు ఎమ్మెల్యేల విషయం ఆసక్తిగా మారింది. ఆ నలుగురి ఓటమిని రాసిపెట్టుకోవచ్చని.. పార్టీలో సీనియర్లు సైతం వ్యాఖ్యానిస్తున్నారు. దీంతో ఆ నియోజకవర్గాలు ఇవేనా.. అంటూ.. ఆసక్తికర చర్చ సాగుతోంది.
పామర్రు నియోజకవర్గం విషయానికి వస్తే.. ఇక్కడ వరుస ఎన్నికల్లో వైసీపీ ఎవరికి టికెట్ ఇచ్చినా గెలుస్తున్న పరిస్థితి ఉంది. 2014, 2019లో వైసీపీ అభ్యర్థులే విజయం దక్కించుకున్నారు. కైలే అనిల్‌కుమార్ గత ఎన్నికల్లో విజయం సాధించారు. అయితే, ఈయన కు పార్టీలో గ్రూపు రాజకీయాలు ఎక్కువయ్యాయి. ఇంటి నుంచి బయటకు రారనే పేరు కూడా ఉంది టీడీపీలో బలమైన నాయకుడు లేకపోవడంతో ఇప్పటి వరకు వైసీపీని గెలిపించిన ఇక్కడి ప్రజలు వచ్చే ఎన్నికల్లో వర్ల రామయ్య కుమారుడికి అవకాశం ఇస్తే.. పరిస్థితి మారొచ్చనే అంచనాలు వస్తున్నాయి.
పెడన నియోజకవర్గం నుంచి గత ఎన్నికల్లో వైసీపీ తరఫున గెలిచిన జోగి రమేష్ ప్రస్తుతం మంత్రి అయ్యారు. అయితే.. ఈయనకు ప్రజల్లో ఆశించిన మార్కులు అయితే పడడం లేదనే పేరు వచ్చేసింది. గత ఎన్నికల్లో 7832 ఓట్లు సాధించిన.. ఈయన వచ్చే ఎన్నికల్లో గెలుపు గుర్రం ఎక్కుతారా? అనేది ప్రశ్నగా మారింది. టీడీపీ సీనియర్ నాయకుడు కాగిత వెంకట్రావు మరణంతో ఆయన కుమారుడు కాగిత కృష్ణప్రసాద్‌కు సానుభూతి పవనాలు వీచే అవకాశం కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఇక్కడకూడా ఫైట్ హోరా హోరీగా సాగుతుందని అంచనా వేస్తున్నారు.
కైకలూరు నియోజకవర్గంలో గత ఎన్నికల్లో వైసీపీ తరఫున దూలం నాగేశ్వరరావు విజయం దక్కించుకున్నారు. 9,357 ఓట్లతో ఆయన విజయం సాధించారు. అయితే.. ఇక్కడ వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి. సొంత పార్టీలోనూ దూలం అంటే పడనివారు..వ్యతిరేక వర్గంగా మారిపోయారు. ఇక, ఏ ఒక్క సమస్య పరిష్కరించడం లేదనే వాదన బలంగా వినిపిస్తోంది. దీంతో వచ్చే ఎన్నికల్లో దూలం నాగేశ్వరరావుకే కనుక టికెట్ ఇస్తే..ఆయన ఓటమి ఖాయమని వైసీపీలనే ఓ వర్గం ప్రచారం చేస్తుండడం గమనార్హం.
జగ్గయ్య పేట నియోజకవర్గం నుంచి గత ఎన్నికల్లో విజయం దక్కించుకున్న సామినేని ఉదయభాను కు కేవలం మూడేళ్లలోనే వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి. ఆయన దూకుడు.. కుటుంబ రాజకీయాలు.. వంటివి జోరుగా పనిచేస్తున్నాయి. అభివృద్ధి విషయం పక్కన పెడితే.. ఆయన ఎవరికీ అందుబాటులో ఉండడం లేదనే కామెంట్లు వినిపిస్తున్నాయి. టీడీపీ తరఫున శ్రీరాం రాజగోపాల్ ఉరఫ్ శ్రీరాం తాతయ్యకు సింపతీ పెరుగుతోంది. గత ఎన్నికల్లో వీరిద్దరి మధ్య ఓట్ల తేడా కేవలం 4778 కావడం, సామినేనికి వ్యతిరేకత పెరుగుతుండడం వంటివి.. వైసీపీ ఓటమి బాటపట్టేలా ఉందని చెబుతున్నారు. మొత్తంగా ఈ నాలుగు చోట్లా వైసీపీ పరాజయం ఖాయమని అంటున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.