ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము తెలంగాణా పర్యటన రద్దయింది. షెడ్యూల్ ప్రకారం మంగళవారం ఉదయం ద్రౌపది తెలంగాణాలోని బీజేపీ ఎంపీ, ఎంఎల్ఏలతో సమావేశమవ్వాలి. తర్వాత అక్కడి నుండి ఏపీకి వెళ్ళాలి. అయితే చివరి నిమిషంలో తెలంగాణా పర్యటనను రద్దు చేసుకున్నారు. కారణం ఏమిటంటే టైం వేస్టు తప్ప పెద్దగా ప్రయోజనం లేదని అనుకోవటమే. ఇంతకీ విషయం ఏమిటంతే తెలంగాణాలో బీజేపీకి నలుగురు లోక్ సభ+ఒక రాజ్యసభ ఎంపీలున్నారు. అలాగే ముగ్గురు ఎంఎల్ఏలున్నారు.
అంటే ఈ ఎనిమిది ప్రజాప్రతినిధులు తప్ప ముర్ముతో సమావేశానికి హాజరయ్యే ప్రజాప్రతినిధులు ఎవరు ఇకలేరు. వీళ్ళందరు కూడా బీజేపీ సభ్యులే కావటంతో ఎనిమిదిమందితో భేటీకి కనీసం రెండు మూడు గంటలు ఎందుకనే ఆలోచన వచ్చిందట. పార్టీ ఓట్లు కాబట్టి ఎటూ వేస్తారన్న కారణంతోనే చివరి నిముషంలో తెలంగాణా పర్యటనను బీజేపీ అధిష్టానమే రద్దుచేసింది.
ఇందుకనే ఈ సమయాన్ని పశ్చిమబెంగాల్లోని బీజేపీ+మిత్రపక్షాల ఎంపీలు, ఎంఎల్ఏలతో సమావేశమవ్వాలని డిసైడ్ చేశారు. ఉదయం కోలకత్తాలో వీళ్ళతో సమావేశం కాగానే మధ్యాహ్నానికి ముర్ము ఏపీకి చేరుకుంటారు. మంగళగిరిలో కన్వెన్షన్ హాలులో జగన్మోహన్ రెడ్డి, ఎంపీలు, ఎంఎల్ఏలతో భేటీ అవుతారు. తర్వాత సీఎం క్యాంపాఫీసుకు వెళ్ళి జగన్ తో తేనీటి విందులో పాల్గొంటారు. అక్కడి నుండి సాయంత్రం మళ్ళీ ఢిల్లీకి వెళ్ళిపోతారు.
ఏపీ పర్యటనలో ముర్ముతో పాటు కేంద్ర పర్యాటకశాఖ మంత్రి కిషన్ రెడ్డి కూడా ఉంటారు. మొత్తానికి ద్రౌపది చాలా టైట్ షెడ్యూల్ అని అర్థమవుతోంది. ఎందుకంటే ముర్ము పర్యటించాల్సిన రాష్ట్రాలు, కలవాల్సిన ప్రజాప్రతినిదులు చాలామందున్నారట. ఒకవైపు పోలింగ్ తేదీ 18 దగ్గరకు వచ్చేస్తోంది. అందుకనే హడావుడిగా ద్రౌపది సమావేశాలు పెట్టుకుని ముగించేస్తున్నారు. ఇదే సమయంలో ప్రత్యర్ధి, యశ్వంత్ సిన్హా కూడా సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. గెలుపు ద్రౌపదికి లాంఛనమే అని తెలిసినా ఇద్దరు కూడా అందరినీ కలవాలన్న కనీస మర్యాదను పాటిస్తున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates