“వాషింగ్ పౌడ‌ర్ నిర్మా..” బీజేపీని ఉతికేసిన కేసీఆర్‌

తాజాగా కేంద్ర ప్ర‌భుత్వంపై నిప్పులు చెరిగిన తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌.. ఓ రేంజ్‌లో బీజేపీ విధానాల‌ను ఉతికి ఆరేశారు. త‌మ‌పైనా.. త‌మ ప్ర‌భుత్వంపైనా ఈడీని ప్ర‌యోగిస్తామ‌ని.. సీబీఐని ఉసిగొల్పుతామ‌ని.. ప‌దే ప‌దే బీజేపీ నేత‌లు చెబుతున్న వ్యాఖ్య‌ల‌ను కేసీఆర్ త‌ప్పుబ‌ట్టారు. బీజేపీ విధానాల‌ను ఆయ‌న ఈ సంద‌ర్భంగా వీడియో రూపంలో బ‌ట్ట‌బ‌య‌లు చేశారు.

అప్ప‌టి వ‌ర‌కు త‌ప్పులు చేశారు.. త‌ప్పులు చేశారు.. అన్న సీబీఐ.. బీజేపీలో చేరిన త‌ర్వాత‌.. స‌ద‌రు త‌ప్పులు ఒప్పులు చేస్తోందా? అని ప్ర‌శ్నించారు. ఈ క్ర‌మంలో గ‌తంలో సీబీఐ, ఈడీ చేసిన దాడులు.. త‌ర్వాత జ‌రిగిన ప‌రిణామాల‌పై వ్యంగ్యాస్త్రం సంధించారు.

వాషింగ్ పౌడ‌ర్ నిర్మా అడ్వ‌ర్‌టైజ్‌మెంట్ మ్యూజిక్ బ్యాక్ గ్రౌండ్‌తో కేసీఆర్ చూపించిన వీడియో.. తీవ్ర‌స్థాయిలో సంచ‌ల‌నం రేపుతోంది. ఈ విడియోలో ఏముందంటే.. గ‌తంలో టీడీపీలో ఉన్న కేంద్ర మాజీ మంత్రి సుజ‌నా చౌద‌రి ఇళ్ల‌పై సీబీఐ దాడులు చేసింది.

అయితే.. ఆయ‌న బీజేపీలో చేర‌గానే ..అవ‌న్నీ మాఫీ అయిపోయాయి. ఇక‌, ఇదే పార్టీకి చెందిన మ‌రో ఎంపీ సీఎం ర‌మేష్ ఇళ్ల‌పై ఈడీ దాడులు చేసింది. అయితే.. ఆ వెంట‌నే ఆయ‌న బీజేపీలో చేరిపోవ‌డంతో ఈడీ సైలెంట్ అయిపోయింది. ఇక‌, కాంగ్రెస్ నాయ‌కుడు,అస్సాం కు చెందిన హిమంత బిశ్వ‌శ‌ర్మ ఇంటిపైనా.. దాడులు జ‌రిగాయి.

అయితే.. త‌ర్వాత ఆయ‌న కూడా క‌మ‌లం గూటికి చేరుకున్నారు. ఆవెంట‌నే అస‌లు దాడులు ఏమైపోయాయో కూడా తెలియ లేదు. అదేస‌మ‌యంలో ప‌శ్చిమ బెంగాల్‌కు చెందిన తృణ‌మూల్ నేత‌.. సువేందు అధికారిపై శార‌దా చిట్‌ఫండ్ కుంభ‌కోణం ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. దీంతో ఆయ‌న బీజేపీ గూటికి చేరిపోవ‌డంతో ఆ కేసులు ఎటు పోయాయో తెలియ‌ని ప‌రిస్తితి. అదేవిధంగా ముకుల్ రాయ్‌, మ‌హారాష్ట్ర మాజీ ముఖ్య‌మంత్రి నారాయ‌ణ్ రాణే, కాంగ్రెస్ నేత జ్యోతిరాధిత్య సిందియాల‌పై గ‌తంలో సీబీఐ దాడులు చేసింది.

అయితే.. వీరంతా బీజేపీలో చేరిపోవ‌డంతో కేసుల ఊసు లేకుండా పోయింది. ఇక‌, తెలంగాణ మాజీ మంత్రి ఈట‌ల రాజేంద‌ర్ విష‌యాన్ని కూడా కేసీఆర్ ఈ వీడియోలో చూపించారు. మొత్తంగా.. ఈ వీడియో ద్వారా బీజేపీని ఏకేయ‌డం గ‌మ‌నార్హం.