టీడీపీలో చిత్రమైన పరిస్థితి కనిపిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా వచ్చే ఎన్నికల్లో 40 శాతం సీట్లను జూనియర్లకు ఇస్తామని.. పార్టీ అధినేత చంద్రబాబు ప్రకటించారు. ఇది ఒక సంచలన ప్రకటనే. ఇప్పటి వరకు జూనియ ర్లకు 10 నుంచి 15 శాతం టికెట్లు మాత్రమే ఇస్తూ వచ్చారు. అయితే.. వచ్చే ఎన్నికల్లో వైసీపీ దూకుడును దృష్టిలో పెట్టుకున్న ఆయన.. జూనియర్లకు టికెట్లు పెంచారు. ఈ పరిణామంతో అప్పటి వరకు జోరుగా రాజకీయాలు చేసిన.. సీనియర్ నాయకులు.. సైలెంట్ అయ్యారు.
చాలా మంది సీనియర్లు ఇప్పుడు ఎక్కడా కనిపించడం లేదు. తమకు సీట్లు ఇస్తారో.. లేదో అనే బెంగ వారిని వెంటాడుతోంది. దీంతో వారు మన కెందుకులే అనే ధోరణిలో ఉన్నారు. ఈ పరిణామంతో సీనియర్ల జోరు తగ్గిందనే వాదన వినిపిస్తోంది. అయితే..అదే సమయంలో చంద్రబాబు సూచనలు.. సలహాల మేరకు జూనియర్లు పుంజుకోవాలి. కానీ, అలా జరగడం లేదు. ఎక్కడికక్కడ జూనియర్లు కూడా అనుకున్న రేంజ్‌లో బయటకు రాలేక పోతున్నారు. వీరికి అనేక సమస్యలు వెంటాడుతున్నాయి.
ఒకటి ప్రజల్లోకి రావాలంటే.. బలమైన ఆర్థిక శక్తిగా వారు ఉండాలి. కానీ, ఇప్పుడు అలాంటి వారు చాలా తక్కువగా ఉన్నారు. కార్యకర్తలను కలుపుకొని వెళ్లాలన్నా.. వారి సమస్యలను ముందు పరిష్కరించాలి. అదేసమయంలో ప్రజలను కలిస్తే..వారి నుంచి వచ్చే డిమాండ్లకు.. సమస్యలకు పరిష్కార మార్గం చూపించాలి. కానీ, ఇప్పుడు జూనియర్లకు అంత అవగాహన కనిపించడం లేదు. దీంతో ఎక్కడికక్కడ కొందరు మాత్రమే ప్రజల్లోకి వస్తున్నారు.
దీంతో టీడీపీలో సీనియర్లు మౌనంగా ఉండగా.. పుంజుకుంటారని ఆశించిన జూనియర్ల పరిస్థితి కూడా అలానే ఉంది. ఫలితంగా చంద్రబాబు వస్తే తప్ప.. ఎవరూ ముందుకు కదలని పరిస్థితి నెలకొంది. ఈ పరిణామం.. పార్టీని ఇబ్బందుల్లోకి నెట్టిందని అంటున్నారు పరిశీలకులు. దీనిపై ప్రత్యేకంగా దృష్టి పెట్టి సమస్యను పరిష్కరించాలనే డిమాండ్లు జిల్లాల నుంచి వ్యక్తం కావడం గమనార్హం. మరి చంద్రబాబు ఏం చేస్తారో చూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates