వైసీపీ ‘బూతుల ప్లీన‌రీ’ : జ‌న‌సేన ఫైర్

అధికార వైసీపీ నిర్వహించిన రెండు రోజుల ప్లీనరీ సమావేశాలు.. సర్కస్ కంపెనీని తలపించాయని జనసేన ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. రాష్ట్ర అభివృద్ధి, ప్రజాసంక్షేమం గురించి మాట్లాడకుండా.. వైసీపీ నేతలు ఒకరినొకరు సింహాలు, పులులు అంటూ మాట్లాడుకున్నారని విమర్శించారు. రెండు రోజుల ప్లీనరీ సమావేశాలపై జనసేన నేత నాదెండ్ల మనోహర్ పంచ్లు వేశారు. ప్లీనరీ సమావేశాలు సర్కస్ కంపెనీని తలపించాయని ఎద్దేవా చేశారు. అధికార దుర్వినియోగానికి ఈ ప్లీనరీ పరాకాష్ట అని మండిపడ్డారు.

పెద్ద పెద్ద గుడారాలు‌ వేసి.. సర్కస్ నిర్వహించిన విధంగా ప్లీనరీ నిర్వహించారని విమర్శించారు. సీఎం జగన్.. క్రెడిబిలిటీ గురించి మాట్లాడటం వింతగా ఉందన్నారు. ప్లీనరీలో ఎంత మంది పద్దతిగా మాట్లాడారో చెప్పాలన్నారు. బూతులతో నోరు పారేసుకోవడానికి అంత ఖర్చు ప్లీనరీ నిర్వహించాలా? అని ప్రశ్నించారు.

ముఖ్యమంత్రి జగన్ నిజంగా 95 శాతం హామీలు అమలు చేస్తే.. ఏప్రిల్ లో ఎన్నికలకు రావాలని సవాల్ విసిరారు. గడపగడప కూ మన ప్రభుత్వం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సీఎం జగన్ వైసీపీ ప్రజా ప్రతినిధులను బతిమాలుకుంటున్నారని ఎద్దేవా చేశారు. విజయవాడలో జనసేన రెండో‌ విడత “జనవాణి” కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు చెప్పారు. పవన్ కళ్యాణ్ నేరుగా ప్రజల నుంచి అర్జీలు స్వీకరిస్తారని తెలిపారు.

కొడాలి నానికి ఎదురుదెబ్బ

గుడివాడలో మాజీ మంత్రి కొడాలి నానికి ఎదురుదెబ్బ తగిలింది. ఆయనకు అత్యంత సన్నిహితులుగా ఉన్న పాలంకి బ్రదర్స్ సారధిబాబు, మోహన్ బాబు జనసేన పార్టీలో చేరారు. రాజకీయ వ్యవహరాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ సమక్షంలో వారు జనసేన తీర్థం పుచ్చుకున్నారు. తాము 2019 నుండి వైసీపీలో కొనసాగుతున్నామని పోలంకి సారధిబాబు తెలిపారు. గత ఎన్నికల్లో కొడాలి నానితో కలిసి వైసీపీ విజయానికి పని‌ చేశామని చెప్పారు.

అయితే.. ఇటీవలి కాలంలో కొడాలి నాని శృతి మించి మాట్లాడుతున్నారని, పవన్ కళ్యాణ్ పై తరచూ వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారని అన్నారు. రాజకీయ విమర్శలు మాత్రమే చేయాలని తాము కోరినా నాని పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. మాజీ మంత్రి వ్యవహారశైలి నచ్చకనే.. జనసేన పార్టీలో చేరినట్టు చెప్పారు.