కేంద్ర క్యాబినెట్ లో తెలంగాణా ఎంపీ ?

తన మంత్రివర్గాన్ని నరేంద్రమోడి విస్తరించబోతున్నారా ? పార్టీ వర్గాల సమాచారం ప్రకారం అవుననే సమాధానం వినిపిస్తోంది. రాష్ట్రపతి ఎన్నిక తర్వాత కేంద్ర మంత్రివర్గ విస్తరణ ఉంటుందని బీజేపీ నేతలు చెబుతున్నారు. ఈ ఏడాది చివరలో కొన్ని రాష్ట్రాలకు ఎన్నికలు జరగబోతున్నాయి. అలాగే వచ్చే ఏడాది ప్రథమార్ధంలో మరికొన్ని రాష్ట్రాలకు ఎన్నికలు జరుగుతాయి. సో ఎన్నికలు జరిగే రాష్ట్రాలను దృష్టిలో పెట్టుకుని ఆయా రాష్ట్రాలకు మంత్రివర్గంలో అవకాశం ఇవ్వాలని మోడీ అనుకున్నారట.

ఈ ఏడాది చివరలో గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీలకు ఎన్నికలు జరగాల్సుంది. అలాగే వచ్చే ఏడాదిలో కర్ణాటక, తెలంగాణా, మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాలకు ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ రాష్ట్రాల్లో అధికారంలోకి రావాలన్న ఉద్దేశ్యంతో లోకల్ ఎంపీలకు మంత్రివర్గంలో చోటు కల్పించాలన్నది మోడీ ఆలోచనట. ఇందులో భాగంగానే తెలంగాణాలో ఎంపీకి కేంద్రమంత్రివర్గంలో ఒక అవకాశం దక్కే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయట.

ప్రస్తుతం తెలంగాణాలో బీజేపీకి నలుగురు లోక్ సభ ఎంపీలున్నారు. రాజ్యసభకు ఈ మధ్య కొత్తగా డాక్టర్ కే లక్ష్మణ్ ఎంపికయ్యారు. కరీంనగర్ ఎంపీ, తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ ను డిస్టర్బ్ చేసే అవకాశాలు తక్కువ. సికింద్రాబాద్ ఎంపీ కిషన్ రెడ్డి ఇప్పటికే మంత్రిగా ఉన్నారు. ఇక నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్, ఆదిలాబాద్ ఎంపీ సోయం బాబూరావులకు అవకాశం తక్కువే. కాబట్టి కొత్తగా రాజ్యసభ ఎంపీ అయిన లక్ష్మణ్ కు అవకాశాలున్నాయని చెబుతున్నారు.

అరవింద్, బాబూరావులు తమ నియోజకవర్గాల్లో మళ్ళీ గెలవాలంటే బాగా కష్టపడక తప్పవు. వాళ్ళకి మంత్రిపదవి అప్పగిస్తే నియోజకవర్గంలో ఉండే సమయం తగ్గిపోతుంది. అదే లక్ష్మణ్ అయితే రాజ్యసభ ఎంపీ కాబట్టి ప్రత్యేకంగా ఒక నియోజకవర్గమంటు లేదు. కాబట్టి ఈయన్ను మంత్రివర్గంలోకి తీసుకుంటే మొత్తం రాష్ట్రమంతా పర్యటించే అవకాశాలు ఎక్కువగా ఉంది. ఈ కారణంతోనే లక్ష్మణ్ ను మంత్రివర్గంలోకి తీసుకునే అవకాశాలున్నాయని కమలనాథులు అంచనా వేస్తున్నారు.