అధికారమంటే అహంకారం కాదు: జ‌గ‌న్‌

jagan

‘అధికారం అంటే అహంకారం కాదు.. ప్రజలపై మమకారం అని నిరూపించాం’ అని ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి అన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి జయంతిని పురస్కరించుకుని.. గుంటూరులో జ‌రుగుతున్న‌ వైసీపీ ప్లీనరీలో ఆయ‌న మాట్లాడుతూ.. 2009 నుంచి ఇప్పటి వరకు ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నామ‌న్నారు. “2011లో పార్టీ పెట్టుకున్నాం. ఈ ప్రయాణంలో ఎన్ని ముళ్లున్నా, ఎన్ని రాళ్లు పడినా.. ఎన్ని వ్యవస్థలు మనపై కత్తిగట్టినా..ఎన్ని దుష్ప్రచారాలు చేసినా ఆ కట్టుకథలకు విలువలేదు. నా గుండె బెదరలేదు. నా సంకల్పం చెదరలేదు” అని వ్యాఖ్యానించారు.

వైఎస్‌ చనిపోయిన తర్వాత ఈ జగమంత కుటుంబం ఏనాడూ త‌న‌ చేయి వీడలేదని జ‌గ‌న్ అన్నారు. తోడుగా నిలబడ్డారని, అడుగులు వేయడానికి బలాన్నిచ్చారని అన్నారు. అందుకే 2019లో చరిత్రలో కనీవినీ ఎరుగని మెజార్టీని ప్రజలు ఇచ్చారని తెలిపారు. దేవుడు, ప్రజల ఆశీస్సులతో 175 స్థానాలకు గాను ఏకంగా 151 మంది ఎమ్మెల్యేలను గెలిపించి అధికారం అప్పగించారని చెప్పారు. అదే సమయంలో మన పార్టీ నుంచి 23 మంది ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎంపీలను కొన్నవారిని దేవుడు, ప్రజలు అదే సీట్లకు పరిమితం చేశారంటూ టీడీపీపై విమ‌ర్శ‌లు గుప్పించారు.

అధికారంలోకి వచ్చాక పేదలు, సామాన్యులు, అన్ని ప్రాంతాలు, అన్ని వర్గాల కోసమే బతికామ‌ని జ‌గ‌న్ చెప్పారు. చెప్పిన మాట నిలబెట్టుకునేందుకే ప్రతిక్షణం తపించామ‌న్నారు. మేనిఫెస్టోను ఎన్నికల సమయంలోనే ప్రచారం చేసి ఆ తర్వాత దాన్ని చెత్తబుట్టలో పడేసిన సందర్భాలు ఈ రాష్ట్రంలో చాలాసార్లు చూశామ‌న్న ఆయ‌న‌ అలాంటి పరిస్థితి నుంచి మేనిఫెస్టోను ఒక భగవద్గీత, ఖురాన్‌, బైబిల్‌గా భావించి పాలన సాగిస్తున్నామ‌న్నారు.

తమ మేనిఫెస్టో దొరకకుండా మాయం చేసిన పార్టీ టీడీపీ.. యూట్యూబ్‌, వెబ్‌సైట్‌ల నుంచి వాళ్లు తీసేయించారని దుయ్య‌బ‌ట్టారు. వైసీపీ మాత్రం మేనిఫెస్టోలోని 95 శాతం హామీలను అమలు చేసి గడపగడపకు వెళ్లి ప్రతి మనిషిని కలుస్తున్నట్టు చెప్పారు. ఈ 13 ఏళ్లలో ప్రయాణంలో ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నామని సీఎం వైఎస్‌ జగన్‌ అన్నారు. “మనపై ఎన్ని రాళ్లు పడ్డా, మనపై ఎన్ని నిందలు వేసినా ఎదుర్కొన్నాం. ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని దాడులు జరిగినా గుండె చెదరలేదు. సంకల్పం మారలేదు. నాన్న ఇచ్చిన ఈ కుటుంబం ఏనాడూ నా చేయి వీడలేదు” అని సీఎం అన్నారు.