పార్టీలోని కోవర్టులతో తీవ్రంగా నష్టపోవటం ఖాయమని చంద్రబాబునాయుడు అన్నారు. కలికిరిలో జరిగిన మినీ మహానాడు కార్యక్రమంలో చంద్రబాబు మాట్లాడారు. మొన్నటి కుప్పం మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ ఓటమికి రెండు కారణాలుగా తేల్చారు. మొదటిది తాను ఏమరుపాటుగా ఉండటం. రెండో కారణం పార్టీలోని కోవర్టులే దెబ్బకొట్టడమని చెప్పారు. కుప్పంలో పార్టీ ఓడిపోయిన తర్వాత తాను మేల్కొన్నట్లు చెప్పారు.
భవిష్యత్తులో అలాంటి దెబ్బ పడకూడదనే తాను కుప్పంలో ఇల్లు కట్టుకుంటున్నట్లు చెప్పారు. అందరికీ అందుబాటులో ఉండాలన్న కారణంతోనే సొంతిల్లు కట్టుకుంటున్నట్లు తెలిపారు. ఇదే సమయంలో పార్టీలోని కోవర్టులను ఏరిపారేశానని కూడా అన్నారు. మరి చంద్రబాబు ఏరేసిన కోవర్టులు ఎవరో ఎవరికీ తెలీటంలేదు. ఎంతమంది కోవర్టులను గుర్తించారు, ఎంతమందిని పార్టీ నుండి పంపేశారో తెలీదు. ముఖ్యమంత్రిగా ఉన్నపుడు పార్టీ విషయాలపైన, నేతలపైన శ్రద్ధ తీసుకోలేదని అంగీకరించారు.
ఇకనుండి అలాంటి ఆరోపణలు వినబడకూడదనే నేతలతో ఎక్కువ సమయం గడుపుతున్నట్లు చెప్పారు. రాబోయే ఎన్నికల్లో నేతలంతా కలిసికట్టుగా పని చేయాలన్నారు. నేతల మధ్య ఉన్న విభేదాలను పక్కన పెట్టి అందరు ఐకమత్యంతో కృషి చేస్తే పార్టీ గెలుపు చాలా సులభమవుతుందన్నారు. అధికారంలోకి రాగానే పార్టీ కోసం కష్టపడిన నేతలందరికీ తగిన గుర్తింపు ఇస్తామని హామీ ఇచ్చారు. పార్టీ కోసం కష్టపడండి తర్వాత తాను అందరినీ పైకి తీసుకొచ్చే బాధ్యత తీసుకుంటానని హామీఇచ్చారు.
మొత్తం మీద మినీ మహానాడు కార్యక్రమం బాగానే జరిగింది. కాకపోతే తంబళ్ళపల్లి నియోజకవర్గంలోని రెండు వర్గాలు చంద్రబాబు ఎదుటే గొడవలు పడ్డాయి. నియోజకవర్గ ఇన్చార్జి శంకర్ యాదవ్ వ్యాపారాల పేరుతో బెంగుళూరులో కాకుండా నియోజకవర్గంలో నేతలు, కార్యకర్తలకు అందుబాటులో ఉండాలని గట్టిగా చెప్పారు. నియోజకవర్గం ఇన్చార్జన్నాక పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనకపోతే ఎలాగంటు నిలదీశారు. ఎన్నికలు దగ్గరకు వస్తున్న కారణంగా అందరు ప్రభుత్వానికి వ్యతిరేకంగా సమిష్టి పోరాటాలు చేయాలని పిలుపిచ్చారు. మరి చంద్రబాబు మాట ఎంతమందికి ఎక్కుతుందో చూడాల్సిందే.
Gulte Telugu Telugu Political and Movie News Updates