ఏపీ అధికార పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్‌కు ఆ పార్టీ గౌరవ అధ్యక్షురాలిగా ఉన్న విజయమ్మ సంచలన నిర్ణయం తీసుకున్నారు. పార్టీలో తన పదవికి ఆమె రాజీనామా సమర్పిస్తున్నట్టు ప్రకటించారు. ఇక నుంచి తాను తెలంగాణలో తన బిడ్డ షర్మిల పార్టీకి పనిచేయనున్నట్టు వెల్లడించారు. గుంటూరులో ఈ రోజు ఉదయం ప్రారంభమైన వైసీపీ ప్లీనరీ వేదికగా.. మాట్లాడిన ఆమె తన గౌరవ అధ్యక్షురాలి పదవికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు.
ఇప్పటికే తన రాజీనామాపై కొన్ని పత్రికల్లో కథనాలు వచ్చాయని.. వాటిని తాను చదివానని.. అయితే.. వారు అనుకుంటున్నట్టుగా తాను విభేదాలు వచ్చి రాజీనామా చేయడం లేదని.. ఆమె వ్యాఖ్యానించారు. ఇక నుంచి తాను షర్మిల పార్టీకి పనిచేయనున్న నేపథ్యంలో ఎలాంటి విమర్శలు, వక్రీకరణలకు తావివ్వరాదనే ఉద్దేశంతోనే పదవికి రాజీనామా చేస్తున్నానని తెలిపారు. తన కుమార్తె షర్మిల తెలంగాణలో పార్టీపెట్టారని.. తన అవసరం అక్కడ ఎంతో ఉందని తెలిపారు.
ఈ నేపథ్యంలో.. ఏపీలోను, తెలంగాణలోనూ తాను పార్టీలకు పనిచేయడం సరికాదని విజయమ్మ పేర్కొన్నారు. అందుకే అనుకోని పరిస్థితిలో రాజీనామా చేయాల్సి వచ్చిందని తెలిపారు. ఈ పరిస్థితి వస్తుందని తాను ఊహించలేదని విజయమ్మ అన్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి బడ్డలు ఇప్పుడు ప్రజల ముందు ఉన్నారని.. ప్రజల కోసం సేవ చేసేందుకు వచ్చారని ఆమె తెలిపారు. ఎన్నో కష్టాలను ఎదుర్కొని నిలిచామని వైఎస్ విజయమ్మ అన్నారు.
తమ కుటుంబంపై గత కాంగ్రెస్ పాలకులు అన్యాయంగా కేసులు పెట్టి వేధించారని, అధికార శక్తులన్నీ జగన్‌పై విరుచుకుపడ్డా బెదరలేదని తెలిపారు. జగన్ ఓర్పు, సహనంతో ఎంతో ఎత్తుకు ఎదిగారని అన్నారు. ఎలాంటి వివక్ష లేకుండా అందరికీ సంక్షేమ పథకాలు అందిస్తున్నారని వైఎస్ విజయమ్మ చెప్పారు. గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, జగనన్న అమ్మ ఒడి, పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చి పాలనలో విప్లవాలు తెచ్చారని వైఎస్ విజయమ్మ అన్నారు.