వైఎస్ విజయమ్మ. దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి సతీమణిగానే కాదు.. కాంగ్రెస్‌ను ఎదిరించి.. ఢిల్లీ కాంగ్రెస్ పెద్దలకు భారీ షాక్ ఇస్తూ.. వైఎస్ కుమారుడు ప్రస్తుత ఏపీ సీఎం జగన్ స్థాపించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి గౌరవ అధ్యక్షురాలు. కేవలం ఈ పదవికి మాత్రమే ఆమె పరిమితం కాలేదు. ఈ రోజు ఏపీలో వైసీపీ సర్కారు ఏర్పడడంలో కీలక రోల్ పోషించారు. 2014 ఎన్నికల్లోనూ.. 2019 ఎన్నికల్లోనూ.. రాష్ట్ర వ్యాప్తంగా సుడిగాలి పర్యటనలు చేశారు.
వైసీపీని గెలిపించాలని.. జగన్‌కు ఒక్క ఛాన్స్ ఇవ్వాలని.. ప్రజలకు విన్నవించారు. అదేసమయంలో 2014లో విశాఖ ఎంపీ స్థానం నుంచి కూడా పోటీ చేశారు. ఆ తర్వాత.. బస్సు యాత్రలు చేసి.. ఏపీలో వైసీపీని అధికారంలోకి తీసుకురావడంలో కీలక రోల్ పోషించారు. ఇక, 2019 ఎన్నికలకు ముందు నిర్వహించిన ప్లీనరీలోనూ.. విజయమ్మ ప్రత్యేక ఆకర్షణగా మారారు. కట్ చేస్తే.. గత మూడేళ్లుగా ఏపీలో ఆమె పెద్దగా కనిపించడం లేదు. కేవలం హైదరాబాద్, బెంగళూరుకు పరిమితం అయ్యారు.
పైగా.. హైదరాబాద్‌లో ఆమె కుమార్తె, జగన్ సోదరి పెట్టుకున్న ప్రాంతీయ పార్టీకి మద్దతిస్తున్నారు. వైఎస్ వర్గాన్ని కూడగట్టే ప్రయత్నంలోనూ ఉన్నారు. ఇక, ఈ కారణాలకు మరికొన్ని కారణాలు తోడై.. విజయమ్మ ఏపీకి దూరంగానే ఉంటున్నారు. ముఖ్యంగా పార్టీలో జరుగుతున్న పరిణామాలు.. ప్రభుత్వ నిర్ణయాలు.. ప్రతిపక్షాల విమర్శలకు కూడా స్పందించడం లేదు. గతంలో చంద్రబాబు చేసే విమర్శలకు.. విజయమ్మ అంతో ఇంతో కౌంటర్ ఇచ్చేవారు. కానీ, ఇప్పుడు కనీసం ఊసు కూడా ఎత్తడం లేదు.
ఈ నేపథ్యంలో శుక్రవారం నుంచి రెండు రోజుల పాటు జరగనున్న ప్లీనరీకి విజయమ్మ ప్రత్యేక ఆహ్వానితురాలిగా.. పార్టీ గౌరవ అధ్యక్షురాలిగా హాజరు కానున్నారని పార్టీ ప్రకటించింది. దీంతో ఇప్పుడు అందరి కళ్లూ.. ఆమెపైనే ఉన్నాయి. ఆమె ఎలా వ్యవహరిస్తారు? జగన్ పాలనపై ఏవిధంగా స్పందిస్తారు? ప్రజలు ఇచ్చిన ఒక్కఛాన్స్‌పై ఏమంటారు? రాజన్న రాజ్యం వచ్చిందని చెబుతారా? ఇలా.. అనే ప్రశ్నలు తెరమీదికి వచ్చాయి.
అంతేకాదు.. ఇప్పుడు తన దృష్టినంతా.. విజయమ్మ.. తన కుమార్తె షర్మిల ఏర్పాటు చేసిన వైఎస్సార్ తెలంగాణ పార్టీ పైనే పెట్టిన నేపథ్యంలో ప్రస్తుతం ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలి పదవికి రాజీనామా చేస్తారనే ప్రచారం జోరుగా సాగుతుండడం గమనార్హం. అందుకే ఆమె ప్లీనరీకి వస్తున్నారని.. ఎలాంటి ప్రసంగాలు చేయకుండానే.. ఆమె.. తన పదవికి రిజైన్ చేసి ‘గౌరవ’ ప్రదంగా తప్పుకునేందుకు రెడీ అయ్యారని అంటున్నారు. మరి విజయమ్మ ఏం చేస్తారో చూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates