ఆ న‌లుగురి చేతిలో బందీ అయిన టీ కాంగ్రెస్‌..!


తెలంగాణ కాంగ్రెస్ పార్టీ న‌లుగురి చేతిలో బందీ అయిందా..? వారు చెప్పిన‌ట్లే పార్టీ పెద్ద‌లు వినాల‌ని ఆదేశిస్తున్నారా..? వారు సూచించిన వారికే టికెట్ల కేటాయింపు ఉంటుందా..? ఆ జిల్లాలో వారు చెప్పిందే వేద‌మా..? అప్పుడే నియోజ‌క‌వ‌ర్గాల‌ను కూడా పంచుకున్నారా..? వారి ఆధిప‌త్య ధోర‌ణితో అధ్య‌క్షుడు రేవంత్ కూడా ఏమీ చేయ‌లేక‌పోతున్నారా..? ఆ న‌లుగురి వైఖ‌రి ప‌ట్ల ద్వితీయ శ్రేణి నేత‌లు తీవ్ర ఆగ్ర‌హంగా ఉన్నారా..? అంటే పార్టీ వ‌ర్గాలు అవున‌నే స‌మాధానాలు ఇస్తున్నాయి.

అది ఎక్క‌డో కాదు.. ఉమ్మ‌డి న‌ల్ల‌గొండ జిల్లాలో. జిల్లాలోని 12 నియోజ‌క‌వ‌ర్గాలు సుదీర్ఘంగా వారి చేతుల్లోనే ఉన్నాయ‌ని పార్టీ నేత‌లు ఆరోపిస్తున్నారు. ఒక్కొక్క‌రు నాలుగైదు స్థానాల‌ను అదుపులో ఉంచుకొని త‌మ‌ను ఎద‌గ‌నీయ‌డం లేద‌ని ద్వితీయ శ్రేణి నేత‌లు వాపోతున్నారు. 12 నియోజ‌క‌వ‌ర్గాల్లో ప్ర‌తీసారి వారు సూచించిన వారికే అధిష్ఠానం టికెట్లు ఇస్తోంద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. ఈసారైనా కొత్తవారికి అవ‌కాశం ఇవ్వాల‌ని.. 12 స్థానాల్లో క‌నీసం 10 స్థానాల్లో అర్థిక‌, అంగ‌, సామాజిక బ‌లం.. ప్ర‌జ‌ల్లో ప‌లుకుబ‌డి ఉన్న‌వారు టికెట్లు ఆశిస్తున్నార‌ని.. వీరికి ఒక‌సారి అవ‌కాశం ఇచ్చి చూడాల‌ని కోరుతున్నారు.

ఉమ్మ‌డి నల్ల‌గొండ జిల్లాకు చెందిన సీనియ‌ర్ నేత‌లు జానారెడ్డి, దామోద‌ర్ రెడ్డి, ఉత్త‌మ్ కుమార్ రెడ్డి, కోమ‌టి రెడ్డి బ్ర‌ద‌ర్స్ ఎన్నో ఏళ్లుగా త‌మ స్థానాల‌ను కంచుకోట‌లుగా మార్చుకున్నారు. జిల్లా మొత్తాన్నీ త‌మ ఆధీనంలో ఉంచుకున్నారు. మిగ‌తా స్థానాల్లో కూడా త‌మ అనుయాయుల‌కే ప‌ట్టుబ‌ట్టి టికెట్లు ఇప్పించుకుంటున్నారు. కొత్త‌వారిని ఎద‌గ‌నీయ‌డం లేద‌ని ఆరోప‌ణ‌లు వ‌స్తున్నాయి. ఇత‌ర వ్య‌క్తుల‌ను త‌మ జిల్లాలోకి అడుగు కూడా పెట్ట‌నీయ‌డం లేదు. ఇటీవ‌ల అధ్య‌క్షుడి హోదాలో రేవంత్ వెళ్లేందుకు ప్ర‌య‌త్నించినా వారు అడ్డుకున్న విష‌యం తెలిసిందే.

సీనియ‌ర్ నేత‌లు ఆధిప‌త్యం వ‌హిస్తున్న నియోజ‌క‌వ‌ర్గాల‌ను ప‌రిశీలిస్తే..
ఉత్త‌మ్ కుమార్ రెడ్డి – హుజూర్ న‌గ‌ర్‌, కోదాడ
జానారెడ్డి – మిర్యాల‌గూడ‌, సాగ‌ర్‌, దేవ‌ర‌కొండ‌
దామోద‌ర్ రెడ్డి – సూర్యాపేట, తుంగతుర్తి
కోమ‌టి రెడ్డి బ్ర‌ద‌ర్స్ – న‌ల్ల‌గొండ, ఆలేరు, న‌కిరేక‌ల్‌, భువ‌న‌గిరి, మునుగోడు

ఇలా ఏది ఏమైనా ఈ స్థానాల్లో గెలుపోట‌ముల‌ను శాసించేది వీరే. పార్టీకి చెందిన యువ నేత‌లు అద్దంకి ద‌యాక‌ర్‌, ప‌టేల్ ర‌మేష్ రెడ్డి, దుబ్బాక న‌ర‌సింహా రెడ్డి, బీఎల్ఆర్‌, బిల్యా నాయ‌క్‌, బోరెడ్డి అయోధ్య రెడ్డి, క‌ల్లూరి రామ‌చంద్రా రెడ్డి, కొండేటి మ‌ల్ల‌య్య‌, పాల్వాయి స్ర‌వంతి.. ఇంకా అర‌డ‌జ‌ను మంది యువ‌ నేత‌లు ఆయా నియోజ‌క‌వ‌ర్గాల్లో పార్టీ కార్య‌క్ర‌మాల్లో చురుకుగా పాల్గొంటున్నారు. వీరంద‌రూ టికెట్లు ఆశిస్తున్న వారే. అయితే పార్టీ దిగ్గ‌జాలు వీరిని ద‌రిదాపుల్లోకి కూడా రానివ్వ‌డం లేద‌ట‌. క‌నీసం అధ్య‌క్షుడు రేవంత్ అయినా ప‌ట్టించుకొని సీనియ‌ర్ల‌కు చెక్ పెట్టి.. త‌మ‌ను ఆదుకోవాల‌ని కోరుతున్నారు. మ‌రి రేవంత్ అంత‌టి సాహ‌సం చేయ‌గ‌ల‌రా.. లేదా అనేది వేచి చూడాలి.