ఉపరాష్ట్ర పతి ఎన్నికపై బీజేపీ వ్యూహాత్మకంగా అడుగులు వేసింది. ఇప్పటికే రాష్ట్రపతి అభ్యర్థిగా ఆదివాసీ గిరిజన మహిళను ఎంపిక చేసిన బీజేపీ, ఇప్పుడు ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా మైనారిటీ నేతకు అవకాశం ఇవ్వనుంది. ఈ క్రమంలో ప్రస్తుతం కేంద్ర మంత్రిగా ఉన్న ముక్తార్ అబ్బాస్ నఖ్వీ.. తన పదవులకు రాజీనామా చేశారు. అంటే.. ఆయన రేపో మాపో.. ఉపరాష్ట్రపతి రేసులోకి రానున్నారని ఢిల్లీ వర్గాలు చెబుతున్నాయి.
కేంద్ర మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ, ఉక్కు శాఖ మంత్రి ఆర్సీపీ సింగ్.. తమ పదవులకు రాజీనామా చేశారు. ఈమేరకు ప్రధాని నరేంద్ర మోడీకి లేఖలు సమర్పించారు. బుధవారం ఉదయం జరిగిన కేబినెట్ సమావేశంలో నఖ్వీ, ఆర్సీపీ సింగ్ దేశానికి చేసిన కృషిని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కొనియాడారు.
రాజ్యసభ సభ్యునిగా నఖ్వీ పదవీకాలం గురువారంతో ముగియనుంది. ఆయనకు బీజేపీ మరోమారు అవకాశం ఇవ్వలేదు. సిట్టింగ్ మంత్రి పార్లమెంట్ ఉభయ సభల్లో సభ్యునిగా కాకుండా ఉండడం చరిత్రలో ఇదే తొలిసారి. ఎంపీగా లేకపోతే మంత్రిగా కొనసాగరాదన్న నిబంధన మేరకు ఆయన కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేశారు. నఖ్వీ పేరును ఉపరాష్ట్రపతి పదవికి పరిశీలిస్తున్నట్లు బీజేపీ వర్గాలు వెల్లడించాయి. మరోవైపు.. రాజ్యసభ సభ్యునిగా నఖ్వీ పదవీకాలం ముగింపుతో బీజేపీలో ఒక్క ముస్లిం ఎంపీ కూడా లేనట్టయింది.
బిహార్కు చెందిన జేడీయూ నేత ఆర్సీపీ సింగ్ 2021 జులై 7న మోడీ మంత్రివర్గంలో చేరారు. ఇటీవలే ప్రకటించిన రాజ్యసభ సభ్యత్వాల్లో జేడీయూ సింగ్ పేరును ప్రకటించలేదు. కొద్దిరోజుల క్రితం బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల సందర్భంగా ఆయన హైదరాబాద్ వచ్చారు. దీంతో ఆర్సీపీ సింగ్ బీజేపీలో చేరతారని అంతా భావించినా.. అలా జరగలేదు. ఇక, ఇప్పుడు అబ్బాస్‌ను ఉపరాష్ట్రపతి రేసులో తీసుకుంటున్నందున ఆయనకు సభ్యత్వం అవసరం లేదని తెలుస్తోంది. ఏదేమైనా ఎన్నికల్లో మైనారిటీలకు ఒక్క టికెట్ కూడా ఇవ్వని బీజేపీ వచ్చే ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఉపరాష్ట్ర పదవికి ఎంపిక చేస్తుండడంపై రాజకీయ విశ్లేషకులు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates