“దక్షిణాది రాష్ట్రాల్లో పాగా వేస్తాం. మేం చాలా భిన్నంగా ఆలోచిస్తున్నాం. ఈ రాష్ట్రాల్లో బీజేపీ పుంజుకునేలా ప్రయత్నాలు ముమ్మ రం చేస్తున్నాం“ ఇదీ.. ఇటీవల హైదరాబాద్‌లో నిర్వహించిన బీజేపీ సభలో కేంద్ర హోం మంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షా చేసిన వ్యాఖ్య. దీనిపై అనేక విశ్లేషణలు వచ్చాయి. ఈ పార్టీకి ఇప్పుడున్నది వాపేనని.. బలుపుకాదని అందరూ అనుకున్నారు. అంతేకాదు.. కేవలం నాయకుల బలంతో తెలంగాణలో కొన్ని ఎంపీ స్థానాలు… ఎమ్మెల్యే స్థానాలు దక్కించుకున్న మాత్రాన.. బీజేపీకి దక్షిణాదిలో విస్తరించే సత్తాలేదని లెక్కలు తెరమీదికి వచ్చాయి.
ఇక, ఏపీలోనూ 1 శాతం ఓటు బ్యాంకు కూడా లేదని.. అలాంటి పార్టీ ఇక్కడ పాగా వేయడం.. పదవుల్లోకి రావడం.. కల్లేనని నేతలు చెప్పుకొన్నారు. మరోవైపు తమిళనాట అసలుపత్తానే లేని పార్టీగా బీజేపీ ఉంది. కేరళలో చెప్పాల్సిన అవసరమే లేదు. అంటే.. మొత్తంగా బీజేపీ నేతలు.. అమిత్ షా కానీ, ప్రధాని నరేంద్ర మోడీ కానీ.. చేసిన వ్యాఖ్యలు తుస్సే
నని విశ్లేషకులు తేల్చి పారేశారు. ఇక, బీజేపీ అనుకూల వాదులు కూడా మిశ్రమంగా స్పందించారు. కానీ, ఈ విశ్లేషణలకు, అంచనాలకు భిన్నంగా.. కేంద్రంలోని మోడీ.. షాలు.. గిర్రున చక్రం తిప్పారు. ఎవరూ ఊహించని విధంగా.. వ్యూహాత్మక అడుగులు వేశారు.
దక్షిణాదిపై ముప్పేట వరాల జల్లు కురిపించారు. ఏపీ, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాలకు.. పెద్దల సభలో పెద్దపీట వేస్తూ.. సంచలన నిర్ణయం తీసుకున్నారు. నిజానికి ఇప్పటి వరకు ఉత్తరాది వారిని.. ఈ రాష్ట్రాల నుంచి రాజ్యసభకు నామినేట్ చేస్తున్న బీజేపీ.. ఇప్పుడు.. అనూహ్యంగా.. ఇక్కడి వారినే నామినేట్ చేయడం వెనుక.. పక్కా వ్యూహం ఉందనే అంటున్నారు పరిశీల కులు. వాస్తవానికి రాజకీయ ఉద్ధండులకు కూడా ఈ లెక్కలు అందలేదు. అసలు దక్షిణాదిపై ఎలా ముందుకు సాగుతారని.. అందరూ తల పట్టుకున్నారు. కేవలం హైదరాబాద్‌లో సభ పెట్టి చేసిన వ్యాఖ్యలు.. సంచలనం కోసమో.. లేక.. కేసీఆర్‌పై దుమ్మెత్తి పోయడం కోసమో చేశారని అనుకున్నారు.
ఇక, ఏపీలో భీమవరంలో నిర్వహించిన అల్లూరి 125వ జయంతి కార్యక్రమంలోనూ ప్రధాని మోడీ చేసిన పుణ్యభూమి వ్యాఖ్యలను కూడా అందరూ రాజకీయ స్టంటుగానే భావించారు.కానీ, అనూహ్యంగా ఏపీ,తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాలకు చెందిన పరుగుల రాణి పీటీ ఉష, సంగీత దిగ్గజం ఇళయరాజా, కథల బాహుబలి విజయేంద్ర ప్రసాద్‌లను పెద్దలకు రాష్ట్రపతి కోటాలో నామినేట్ చేయడం సంచలనమే కాకుండా.. వచ్చే ఎన్నికలకు ముందు.. బీజేపీ ఈ దక్షిణాది రాష్ట్రాల సెంటిమెంటుపై వేసిన పాచికగా భావించాల్సి ఉంటుందని పరిశీలకులు చెబుతున్నారు.
వాస్తవానికి కేంద్రంలో మోడీ అధికారంలోకి వచ్చి 8 ఏళ్లు పూర్తయ్యాయి. ఇప్పటి వరకు లేని ప్రేమ.. అతి ప్రేమ.. దక్షిణాది రాష్ట్రాలపై ఇంత ఉవ్వెత్తున రాత్రికి రాత్రి వెల్లువెత్తడానికి కారణం.. ఖచ్చితంగా 2024 ఎన్నికలేనని అంటున్నారు పరిశీలకులు. వచ్చే ఎన్నికల్లో ఆయా రాష్ట్రాల్లో పాగా వేయాలని అనుకుంటున్నా.. ఇప్పటికిప్పుడు అధికారంలోకి రాలేని పరిస్థితిని అంచనా వేసిన.. మోడీ, షా ద్వయం.. నెమ్మది నెమ్మదిగా.. దక్షిణాదిన పుంజుకునేందుకు దీనిని
ఒక కీలక అంచెగా భావిస్తున్నట్టు చెబుతున్నారు. ఏదేమైనా.. అత్యంత కీలకసమయంలో.. ఇలా పెద్దల సభకు ఎంపిక చేయడం.. అంత ఉదార నిర్ణయం
అయితే కాదు.. ఊరకరారు… మహాను భావులు.. అన్నట్టుగా.. మోడీ, షా ద్వయం కూడా అంతే.. ఊరికేనే ఏపనీ చేయరు.. భవిష్యత్తు వ్యూహాలు.. రాజకీయ సర్దుబాట్లు వంటి అనేక అంశాలు ఇమిడే ఉంటాయి. అవేంటో తెలియాలంటే కొంత వెయిటింగ్ తప్పదు
.