కొత్త వివాదంలో రఘురామరాజు

వైసీపీ తిరుగుబాటు ఎంపీ రఘురామకృష్ణంరాజు వ్యవహారం చూస్తుంటే ఇలాగే అనిపిస్తోంది. తాజాగా గచ్చిబౌలి పోలీసుస్టేషన్లో ఎంపీతో పాటు ఆయన కొడుకు, పీఏ, భద్రతా సిబ్బందిపై కేసులు నమోదయ్యాయి. ఇంతకీ విషయం ఏమిటంటే ఏపీ ఇంటెలిజెన్స్ కానిస్టేబుల్ ఫరూక్ ను అనుమానాస్పద వ్యక్తిగా అనుమానించి ఎంపీకి భద్రతగా ఉన్న సీఆర్పీఎఫ్ సిబ్బంది కొట్టారట. ఎంపీ ఇంటికి సమీపంలో అనుమానాస్పదంగా ఉన్నాడని చెప్పి ఒక వ్యక్తిని భద్రతా సిబ్బంది పట్టుకున్నారు.

తాను ఏపీ ఇంటెలిజెన్స్ కానిస్టేబుల్ని అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటనలో భాగంగా ఐఎస్బీ దగ్గర డ్యూటీ లో ఉన్నట్లు చెప్పాడు. అయినా వినకుండా అతన్ని బలవంతంగా కారులో ఎక్కించుకుని ఎంపీ ఇంటికి తీసుకెళ్ళారట. అక్కడ ఎంపీ సమక్షంలోనే ఆయన కొడుకు భరత్, ఏపీ శాస్త్రి, భద్రతా సిబ్బంది చావకొట్టారట. తన ఐడెంటి కార్డు చూపించినా ఎంపీ ఇంట్లో తనను కొట్టారంటు కానిస్టేబుల్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదుచేశారు. తనింట్లోకి ప్రవేశించేందుకు ప్రయత్నించిన వ్యక్తిని పట్టుకుని పోలీసులకు అప్పగిస్తే తమపైనే ఎదురు కేసులు పెట్టినట్లు ఎంపీ ఆరోపిస్తున్నారు.

ఇక్కడ గమనించాల్సిందేమంటే ఎంపీ ఇంటి ముందు ఎవరు ఉండకూడదా అనే సందేహం వస్తోంది. అనుమానముంటే వాళ్ళెవరో భద్రతాసిబ్బంది ఆరా తీయవచ్చు. వాళ్ళు చెప్పింది నిర్ధారణ చేసుకోవచ్చు. అంతేకానీ వాళ్ళని పట్టుకుని కొట్టడం ఏమిటో అర్ధం కావటం లేదు. ఇక్కడ కానిస్టేబుల్ తన ఐడెంటిటినీ చూపించినా పట్టించుకోకుండా ఇంట్లోకి తీసుకెళ్ళి కొట్టారంటున్నారు. బలవంతంగా కారులోకి ఎక్కిస్తున్న, గార్డెన్లో కానిస్టేబుల్ ను కొడుతున్న వీడియో దృశ్యాలు అందరు చూశారు. ఇపుడు ఎంపీ ఇంట్లో జరిగిందానికి, అప్పట్లో సీఐడీ విచారణ పేరుతో తనను కొట్టారని ఎంపీ ఆరోపిస్తున్న దానికి తేడా ఏముంది ?

అప్పట్లో తనను సీఐడీ పోలీసులు ఎలాగైతే కారులో బలవంతంగా తీసుకెళ్ళి విచారణ పేరుతో కొట్టారని ఎంపీ చెబుతున్నారో ఇపుడు కానిస్టేబుల్ ను తన సిబ్బందితో అలాగే ఇంటికి పిలిపించుకుని కొట్టించినట్లున్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి మీద కోపాన్ని ఎంపీ ఒక మామూలు కానిస్టేబుల్ పైన చూపించినట్లు అర్ధమవుతోంది.