సాధారణంగా.. విపక్షంలో ఉన్న నాయకులు.. తమ తమ నియోజకవర్గాల్లో పనులు జరగడం లేదంటూ.. నిరసన వ్యక్తం చేస్తారు. లేదా.. తమకు ప్రభుత్వం నిధులు ఇవ్వడం లేదంటూ.. ఆందోళన వ్యక్తం చేస్తారు. ఇది .. కామన్ కూడా! ఏ పార్టీ ప్రభుత్వం ఉన్నా.. సహజంగానే ప్రతిపక్షానికి పెద్దగా ప్రాధాన్యం ఉండదు. కానీ.. అదేం చిత్రమో కానీ.. వైసీపీ సర్కారులో అధికార పార్టీ ఎమ్మెల్యేలు కూడా రోడ్డున పడుతున్నారు. తమకు రూపాయి కూడా ఇవ్వడం లేదని.. కనీసం.. నియోజకవర్గాల్లో పనులు కూడా చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఈ వరుసలో.. తాజాగా నెల్లూరు రూరల్ నియోజకవర్గం ఎమ్మెల్యే.. సీనియర్ నాయకుడు.. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.. సర్కారుపై తీవ్ర విమర్శలు చేశారు. తమకు నిధులు ఇవ్వడం లేదని.. ప్రజలు తమను నిలదీస్తున్నారని ఆయన అన్నారు. ముఖ్యంగా ప్రజలకు చిన్న చిన్న పనులు కూడా చేయలేక పోతున్నామన్నారు. ఈ క్రమంలో స్థానిక ఉమారెడ్డి గుంటలో శ్రీధర్‌రెడ్డి నిరసనకు దిగారు.
డ్రైనేజీపై వంతెన నిర్మాణం చేపట్టాలని గత కొంతకాలంగా ఆయన డిమాండ్ చేస్తున్నారు. ఇప్పుడు తాము అధికారంలో ఉన్నప్పటికీ వంతెన నిర్మాణం జరగలేదని కోటంరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇదే కాలువలోకి దిగి నిరసన తెలిపారు. ఈ క్రమంలో మరోసారి కాలువలో దిగి నిరసన తెలిపిన కోటంరెడ్డి.. రైల్వే, నగర కార్పొరేషన్ అధికారుల నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు
ప్రతిపక్షమైనా, అధికారపక్షమైనా సమస్యల పరిష్కారంలో రాజీలేని పోరాటం చేస్తానన్నారు. ఎప్పటిలోగా పనుల ప్రారంభిస్తారో రాతపూర్వకంగా హామీ ఇవ్వాలని.. అంతవరకు కాలువ వద్ద నుంచి కదలబోనని స్పష్టం చేశారు. ఇచ్చిన గడువులోపు సమస్య పరిష్కారం కాకపోతే డ్రైనేజీలోనే పడుకుంటానని హెచ్చరించారు. దీంతో అధికారులు ఈ నెల 15న నిర్మాణ పనులు ప్రారంభించి వచ్చే నెల 15లోపు పూర్తి చేస్తామని లిఖితపూర్వకంగా హామీ ఇచ్చారు. అనంతరం కోటంరెడ్డి తన నిరసనను విరమించారు.