రేవంత్ పై అసంతృప్తి.. సొంత ఇలాకాపైనే సీనియ‌ర్ల దృష్టి..!

తెలంగాణ కాంగ్రెస్ సీనియ‌ర్లు వ్యూహాత్మ‌క మౌనం వ‌హిస్తున్నారా..? వారి సొంత నియోజ‌క‌వ‌ర్గాల్లో బ‌లోపేతం పైనే దృష్టి పెడుతున్నారా..? రాష్ట్ర‌వ్యాప్త కార్య‌క్ర‌మాల‌పై అనాస‌క్తి చూపుతున్నారా..? టీపీసీసీ అధ్య‌క్షుడు రేవంతుకు స‌హ‌క‌రించ‌డానికి సీనియ‌ర్లు విముఖంగా ఉన్నారా..? ఆయ‌న ఒంటెత్తు పోక‌డ కూడా ఇందుకు కార‌ణ‌మా..? ఇక రాష్ట్ర పార్టీ భారం మొత్తం రేవంతే భ‌రించాలా..? అంటే పార్టీ వ‌ర్గాలు అవున‌నే స‌మాధానాలు ఇస్తున్నాయి.

ఏడాది క్రితం ఏఐసీసీ అధ్య‌క్షుడిగా రేవంత్ కొత్త కార్య‌వ‌ర్గాన్ని నియ‌మించిన‌పుడు అంతా ఆనందించారు. కొంద‌రు సీనియ‌ర్లు వ్య‌తిరేకించినా అధిష్ఠానం వెన‌క‌డుగు వేయ‌లేదు. దీంతో పార్టీలోని యువ‌త‌, ద్వితీయ శ్రేణి నేత‌లు కొత్త కార్య‌వ‌ర్గాన్ని స్వాగ‌తించారు. రేవంతుతో పాటు ఆరుగురు వ‌ర్కింగ్ ప్రెసిడెంట్లు, ప‌దిమంది ఉపాధ్య‌క్షులు, ప్ర‌చార క‌మిటీ చైర్మ‌న్ గా మ‌ధుయాష్కీ నియ‌మితుల‌య్యారు.

దీంతో రేవంత్ వీరంద‌రికీ ప‌ని బాధ్య‌త‌లు అప్ప‌గిస్తార‌ని.. పార్టీ బ‌లోపేతంపై దృష్టి పెడ‌తార‌ని భావించారు. అయితే రేవంత్ ప‌ని విభ‌జ‌న‌కు విముఖంగా ఉన్నారు. అలా చేస్తే ఎవ‌రూ త‌న మాట విన‌ర‌ని.. ఎవ‌రి దారిలో వారు వెళ‌తార‌ని.. ఎక్క‌డిక‌క్క‌డ గ్రూపు రాజ‌కీయాలు చేస్తార‌ని యోచిస్తున్నారు. అందుకే అంతా తానై వ్య‌వ‌హ‌రిస్తున్నారు. జిల్లాల ప‌ర్య‌ట‌న‌లు మొద‌లుకొని.. పార్టీలో చేరిక‌ల వ‌ర‌కు వ‌న్ మ్యాన్ షో చేస్తున్నారు. సీఎల్పీ పోస్టును కూడా రేవంతే హైజాక్ చేసి కార్య‌క్ర‌మాలు న‌డిపిస్తున్నారు.

దీంతో పార్టీలో చాలా మంది సీనియ‌ర్లు మౌన వ్ర‌తం వ‌హిస్తున్నారు. కేవ‌లం వారి సొంత స్థానాల‌కే ప‌రిమితం అవుతున్నారు. రాష్ట్రం సంగ‌తి ప‌క్క‌న పెట్టి ఇంట గెల‌వాల‌ని భావిస్తున్నారు. ఇందుకు ర‌చ్చబండ కార్య‌క్ర‌మాన్నే వేదిక‌గా చేసుకున్నారు. మాజీ పీసీసీ అధ్య‌క్షుడు ఉత్త‌మ్ హుజూర్‌న‌గ‌ర్‌, కోదాడ నియోజ‌క‌వ‌ర్గాల‌పైనే క‌న్నేశారు. ఉప ఎన్నిక‌లో ఓడిపోయిన త‌న స్థానాన్ని తిరిగి ద‌క్కించుకోవాల‌ని.. అలాగే, త‌న స‌తీమ‌ణి ప‌ద్మావ‌తి స్థానం కోదాడ‌ను కూడా చేజిక్కుంచుకోవాల‌ని వ్యూహం ర‌చిస్తున్నారు. నిత్యం ప్ర‌జ‌ల్లోనే ఉంటూ గెలుపున‌కు మార్గం సుగ‌మం చేసుకుంటున్నారు.

ఇంకోవైపు కోమ‌టి రెడ్డి బ్ర‌ద‌ర్స్ కూడా ఇదే బాట‌లో ఉన్నారు. ఎంపీ వెంక‌ట రెడ్డి తిరిగి న‌ల్ల‌గొండ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేయాల‌ని భావిస్తున్నారు. ప్ర‌తి రోజూ ఏదో ఒక కార్య‌క్ర‌మంతో ప్ర‌జ‌ల్లో తిరుగుతున్నారు. ఆయ‌న త‌మ్ముడు మునుగోడు ఎమ్మెల్యే రాజ‌గోపాల రెడ్డి కూడా చురుకుగా క‌దులుతున్నారు. ఏ పార్టీలో ఉన్నా.. వీలైతే మునుగోడు లేదా భువ‌న‌గిరి ఎంపీ స్థానం నుంచి బ‌రిలో ఉండాల‌ని యోచిస్తున్నారు. బ్ర‌ద‌ర్స్ ఇద్ద‌రూ స్థానికంగా చేరిక‌ల‌ను కూడా ప్రోత్స‌హిస్తున్నారు.

మ‌రోవైపు సీఎల్పీ నేత భ‌ట్టి విక్ర‌మార్క కేవ‌లం త‌న మ‌ధిర నియోజ‌క‌వ‌ర్గంలోనే పాగా వేశారు. పాద‌యాత్ర పేరుతో ప్ర‌తి గ్రామంలో తిరుగుతున్నారు. సీఎల్పీ నేత‌గా రాష్ట్ర వ్యాప్తంగా పార్టీని బ‌లోపేతం చేయాల్సింది పోయి కేవ‌లం సొంత స్థానానికే ప‌రిమితం కావ‌డం ప‌లు విమ‌ర్శ‌ల‌కు తావిస్తోంది. ఆయ‌న రేవంతుతో పొస‌గ‌క కూడా మౌనం వ‌హిస్తున్న‌ట్లు తెలుస్తోంది. ఇలా ఆయా జిల్లాలో ఉన్న సీనియ‌ర్లు కూడా కేవ‌లం వారి స్థానాలకే ప‌రిమితం అయ్యారు. మ‌రి రేవంత్ ఒక్క‌రే రాష్ట్ర బాధ్య‌త‌ల‌ను మీదేసుకొని పార్టీని విజ‌య‌ప‌థంలో న‌డిపిస్తారా లేదా అనేది వేచిచూడాలి.