ఒకవైపు బీజేపీ మూడు రోజుల జాతీయ కార్యవర్గ సమావేశాలు మొదలయ్యాయి. మరోవైపు నాన్ ఎన్డీయే పార్టీల ఉమ్మడి రాష్ట్రపతి అభ్యర్ధిగా యశ్వంత్ సిన్హా రాక సందర్భంగా టీఆర్ఎస్ ఏర్పాటు చేసిన సమావేశం. అంటే రెండు వైపులా ఎవరి అజెండా వాళ్ళకు స్పష్టంగా ఉంది. మరి మధ్యలో మధ్యంతర ఎన్నికల సవాళ్ళెందుకు వచ్చాయి ? కమలం పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాల సందర్భంగా కేసీయార్ పై మైండ్ గేమ్ అప్లై చేయడానికి బీజేపీ నేతలు చాలా తీవ్రంగా ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే.
ఈ నేపధ్యంలోనే మధ్యంతర ఎన్నికల సవాళ్ళు మొదలయ్యాయి. బీజేపీ నేతలు మాట్లాడుతూ ప్రభుత్వాన్ని రద్దు చేసుకుని మధ్యంతర ఎన్నికలకు వెళ్ళాలని సవాలు చేశారు. కేసీయార్ చెప్పుకుంటున్న స్థాయిలో రాష్ట్రం అభివృద్ధి చెందితే, సంక్షేమ పథకాలు అందిస్తుంటే మధ్యంతర ఎన్నికలకు వెళ్ళటానికి కేసీయార్ కు భయమెందుకు అంటు రెచ్చగొట్టారు. దాంతో మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వాన్ని కనుక నరేంద్ర మోడీ రద్దు చేసుకుని మధ్యంతరానికి రెడీ అంటే తాము కూడా రెడీ అంటు ప్రకటించారు.
నిజానికి కేంద్రంలో మోడీ కానీ లేదా రాష్ట్రంలో కేసీఆర్ కానీ మధ్యంతర ఎన్నికలకు వెళ్ళే యోచనలో లేరన్నది వాస్తవం. జాతీయస్థాయిలో మోడీ పాలన పై జనాల్లో బాగా వ్యతిరేకత పెరిగిపోతున్నది వాస్తవం. అయితే జనాలకు సరైన ప్రత్యామ్నాయం లేని కారణంగానే వేరే దారి లేక చాలా రాష్ట్రాల్లో జనాలు బీజేపీకి ఓట్లేస్తున్నారు. ఇదే సమయంలో కేసీయార్ పాలపైన జనాల్లో బాగా వ్యతిరేకత పెరిగిపోతోంది.
నిజానికి 2018 ఎన్నికల సమయంలోనే కేసీయార్ పై వ్యతిరేకత పెరిగిపోయింది. అయితే ప్రతి పక్షాల్లో అనైక్యత, జనాల్లో నమ్మకం లేకపోవటం, ప్రతిపక్షాలు బాగా బలహీనంగా ఉన్న కారణంగా మాత్రమే రెండోసారి కేసీయార్ అధికారంలోకి రాగలిగారు. రెండోసారి సీఎం అయిన దగ్గర నుండి ఒంటెత్తు పోకడల వల్ల జనాల్లో మరింత వ్యతిరేకత పెరిగిపోయింది. అందుకనే వచ్చే ఎన్నికల్లో మూడోసారి గెలుపుపై అనుమానాలు పెరిగిపోతున్నాయి. కాబట్టి అక్కడ మోడీ అయినా ఇక్కడ కేసీయార్ అయినా మధ్యంతరానికి వెళ్ళేదిలేదు.