నిజంగా మంత్రిచెప్పినట్లు ప్రత్యేకించి కార్యకర్తలకోసం స్కీం తీసుకొస్తే చాలా గొప్పవిషయమనే చెప్పాలి. కర్నూలులో జరిగిన వైసీపీ ప్లీనరీలో ఆర్ధికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాధరెడ్డి మాట్లాడుతు కష్టపడి పనిచేస్తున్న కార్యకర్తల కోసం పార్టీ ఒక స్కీం తీసుకురాబోతున్నట్లు ప్రకటించారు. ఇపుడు బుగ్గన ప్రకటనపైన పార్టీలో విస్తృతంగా చర్చ మొదలైంది. తొందరలోనే ఇలాంటి స్కీం గనుక తీసుకురాగలిగితే పార్టీ కోసం పనిచేస్తున్న కార్యకర్తలకు మంచిరోజులొచ్చాయనే అనుకోవాలి.
ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే పార్టీ అధికారంలోకి వచ్చి మూడేళ్ళవుతున్నా సామాన్య కార్యకర్తలను గుర్తించటంలేదనే అసంతృప్తి కార్యకర్తల్లో పెరిగిపోతోంది. రెండు ఎన్నికల్లో కష్టపడి పనిచేసిన కార్యకర్తలను అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి మరచిపోయారనే బాధ కార్యకర్తల్లో వ్యక్తమవుతోంది. ఇదే విషయాన్ని సోషల్ మీడియాలో కార్యకర్తలు బాగా షేర్ చేసుకుంటున్నారు.
దాంతో కార్యకర్తల్లోని అసంతృప్తి జగన్ దృష్టికి వెళ్ళింది. ఇందులో భాగంగానే మొదటి మెట్టుగా అచ్చంగా కార్యకర్తల కోసమే జాబ్ మేళాను ఏర్పాటుచేశారు. ఈ మేళాలో పార్టీకోసం పనిచేస్తున్న వేలాదిమందికి వాళ్ళ అర్హతలకు తట్టట్లుగా కంపెనీల్లో ఉద్యోగాలొచ్చినట్లు ఎంపి విజయసాయిరెడ్డి ప్రకటించారు. అంతాబాగానే ఉందికానీ కిందస్ధాయిలో పనిచేసే, సోషల్ మీడియాలో చొక్కాలు చింపుకుని పనిచేసే కార్యకర్తల మాటేమిటి ? అనే చర్చ మొదలైంది.
ఈ నేపధ్యంలోనే ప్రత్యేకించి ఒక స్కీం విషయంలో జగన్ వర్కవుట్ చేస్తున్నారట. ఇదిగనుక లాంచ్ అయితే మరెంతమందికి లబ్ది జరుగుతుందో తెలీదు. ఎలాగూ ఎన్నికలు దగ్గరకు వచ్చేస్తున్నాయి. షెడ్యూల్ ఎన్నికలకు ఇక ఉన్నది రెండేళ్ళు మాత్రమే. ఇపుడు గనుక కార్యకర్తల శ్రేయస్సును దృష్టిలో పెట్టుకోకపోతే వచ్చే ఎన్నికల్లో దెబ్బపడుతుందని భయం మొదలైనట్లుంది. అందుకనే బుగ్గన ప్రత్యేకించి స్కీంటు ప్రకటించింది. మరి జగన్ చేస్తున్న కసరత్తు ఏమిటో ? ఎప్పటికి పూర్తవుతుందో ? ఎప్పుడు లాంచ్ అవుతుందో అనేది సస్పెన్స్ గా మారిపోయింది.