వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రావాలనిగట్టిగా నిర్ణయించుకున్న టీడీపీ.. ఆదిశగా అనేక మార్గాల్లో పరుగులు పెడుతోంది. ప్రజలకు చేరువ అయ్యేందుకు పార్టీ కార్యక్రమాలను ముమ్మరం చేసింది. పార్టీ అధినేత చంద్రబాబు.. జిల్లాల యాత్రలు చేస్తున్నారు. అక్టోబరు రెండు నుంచి పార్టీ యువ నాయకుడు.. మాజీ మం త్రి నారా లోకేష్ పాదయాత్రలు చేస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా మినీ మహానాడులు నిర్వహించి ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు ప్రాధాన్యం ఇస్తున్నారు.
అయితే.. వీటితోపాటు.. ప్రజల్లో సెంటిమెంటును రగిలించేందుకు కూడాటీడీపీ వ్యూహాత్మకంగా అడుగు లు వేస్తోంది. దీనిలో భాగంగా పేదలు, కార్మికులను లక్ష్యంగా చేసుకుని .. రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజక వర్గాల్లోనూ రెండు నుంచి మూడు చోట్ల అన్నాక్యాంటీన్లను ఏర్పాటు చేస్తోంది. ఇప్పటికే పలు ప్రాంతాల్లో వీటిని ఏర్పాటు చేసి నిర్వహిస్తున్నారు. అయితే.. ప్రభుత్వం నుంచి కొన్ని చోట్ల నిర్బంధాలు వచ్చినా.. టీడీపీ మాత్రం ముందుకే సాగుతోంది.
గత ఎన్నికలకు ఏడాది ముందు ప్రారంభించిన అన్నా క్యాంటీన్లకు ప్రజల నుంచి మంచి స్పందన లభించింది. కేవలం రూ.5 కే టిఫిన్ , భోజనం వంటివాటిని ఈ క్యాంటీన్ల ద్వారాఅందించారు. దీంతో పేదలు.. కార్మికులు.. ఎక్కువగా వీటికి అలవాటు పడ్డారు. అయితే.. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత.. వీటిని ఎత్తేసింది. మరోవైపు.. అన్ని వస్తువుల ధరలు కూడా పెరిగిపోయాయి. ఈ నేపథ్యంలోపేదలకు ఇబ్బందిగానే ఉంది. దీనిని గమనించిన టీడీపీ వ్యూహాత్మకంగా అడుగులు వేసింది.
పేదలకు చేరువయ్యేందుకు.. పోయిన ఓటు బ్యాంకును సమీకరించేందుకు దీనికి మించిన మార్గం లేదని భావించిన టీడీపీ.. అన్నాక్యాంటీన్లను పెద్ద ఎత్తున ఏర్పాటు చేసి నిర్వహించాలని నిర్ణయించింది. దీనికి ఎన్నారైల నుంచి కూడా సాయం అందే అవకాశం కనిపిస్తోంది. ఇటీవల ఎన్నారై.. టీడీపీ సమన్వయ కర్త.. కోమటి జయరాం.. పదిజిల్లాల్లో ఏర్పాటు చేసే అన్నాక్యాంటీన్లకు తమ వంతు సాయం అందిస్తామన్నారు. దీనిని బట్టి నిధులకు లోటు లేదు. ఈ నేపథ్యంలో మిగిలిన జిల్లాల్లోనూ నిధులు సమీకరించి.. వీటిని ఏర్పా టు చేసి.. పేదలకు మరింత చేరువ కావాలని నిర్ణయించింది. మరి ఏమేరకు సక్సెస్ అవుతుందో చూడాలి.