ఏపీలో మార్పు రానుందా? వచ్చే ఎన్నికల నాటికి.. బీజేపీతో టీడీపీ.. టీడీపీతో బీజేపీ కలిసి పనిచేసేందు కు మార్గం సుగమం కానుందా? ఈ క్రమంలో వడివడిగా అడుగులు పడుతున్నాయా..? అంటే.. ఔననే అం టున్నారు పరిశీలకులు. ఇప్పటి వరకు ఒక ప్రచారంగానే ఉన్న బీజేపీ-టీడీపీ కలయిక.. సాధ్యం కాదని.. కొందరు ప్రచారం చేస్తున్నారు. అయితే… దీనికి భిన్నమైన పరిస్థితి తాజాగా వెలుగు చూసింది. ఏకంగా.. కేంద్ర మంత్రి, సీనియర్ నాయకుడు బీజేపీ నేత.. కిషన్‌రెడ్డి.. నేరుగా టీడీపీ అధినేత చంద్రబాబుకుఫోన్ చేశారు.
జూలై 4న ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఏపీకి రానున్నారని.. భీమవరంలో పర్యటించనున్నారని.. సో.. ఆ కార్యక్రమానికి.. మీరు కూడారావాలని.. చంద్రబాబుకు కిషన్ రెడ్డి ఆహ్వానం పలికారు. ఈ పరిణామాలే.. ఇప్పుడు.. ఈ రెండు పార్టీల మైత్రీ బంధంపై.. అనేక చర్చలకు దారితీసింది. 2014లో కలిసి ఏపీలో పోటీ చేసి.. ప్రభుత్వాన్ని పంచుకున్న టీడీపీ.. తర్వాత.. 2019 వచ్చే నాటికి బీజేపీతో విబేదించి..ఒంటరిగా పోటీ చేసింది. దీంతో పార్టీ ఘోరంగా ఓడిపోయిందనే భావన టీడీపీనేతల్లో ఉంది.
బీజేపీలోనూ.. ఇదే తరహా ఆలోచన ఉంది. “టీడీపీతో కలిసిఉంటే.. కనీసం.. నాలుగైదు స్థానాల్లో అయినా.. విజయం దక్కించుకునేవారం కదా!” అని కమలం పార్టీ నాయకులు ఇప్పటికీ.. వాపోతుంటారు. అయితే.. ఈ రెండు పార్టీల పొత్తు విషయంలో ఇప్పటికీ ఎలాంటి నిర్ణయం వెలువడలేదు. కానీ.. వైసీపీని అధికారం లో రాకుండా.. చూసేందుకు.. వైసీపీ వ్యతిరేక ఓటు బ్యాంకు చీలకుండా చూసేందుకు ప్రయత్నిస్తానన్న జనసేనాని.. ప్రకటనతో ఒకింత రాజకీయాలు వేడెక్కాయి.
ఈ క్రమంలోనే ఇటీవల కాలంలో బీజేపీ-టీడీపీ మధ్య పొత్తు సంకేతాలు వస్తున్నాయి. కొన్నాళ్ల కిందట.. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఏపీలో పర్యటించారు. ఆ సమయంలో ఆయన వైసీపీపై విమర్శలు చేశారే.. తప్ప ప్రధాన ప్రతిపక్షం టీడీపీపై ఎలాంటి కామెంట్లు చేయలేదు. ఇక, తర్వాత.. కొన్నాళ్లకు.. బీజేపీ రాష్ట్ర చీఫ్.. సోము వీర్రాజు.. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు.. ఎదురు పడి ఒకరినొకరు కుశల ప్రశ్నలు వేసుకున్నారు. దీంతో ఇరు పార్టీల మధ్య పొత్తు పుష్పాలు.. విరుస్తున్నాయని అందరూ అనుకున్నారు.
తాజాగా.. టీడీపీ అధినేత చంద్రబాబుకు బీజేపీ కీలక నాయకుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లేఖ రాయడం.. మరింత ఆశ్చర్యంగా ఉంది. అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకలకు హాజరు కావాలని చంద్రబాబుకు లేఖలో ఆయన విజ్ఞప్తి చేశారు. జూలై 4న భీమవరంలో ప్రధాని మోడీ పాల్గొనే కార్యక్రమానికి బాబును పిలవడం.. అత్యంత ఆశ్చర్యకరంగా ఉండడం గమనార్హం. ఆహ్వాన లేఖతో పాటు చంద్రబాబుకు ఫోన్ చేసిన కిషన్ రెడ్డి.. ఆయనను ఆహ్వానించారు. అయితే.. ఈకార్యక్రమానికి తన బదులు అచ్చెన్నాయుడు వస్తారని.. బాబు చెప్పారని సమాచారం. ఈ పరిణామాలను గమనిస్తే.. బీజేపీ-టీడీపీలు రాబోయే రోజుల్లో చేతులు కలపడం ఖాయమనే సంకేతాలు వస్తున్నాయి.