మూడేళ్ల కిందట వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్కారు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి గత ప్రభుత్వ హయాంలో ఇంటలిజెన్స్ బ్యూరో చీఫ్‌గా పని చేసిన ఏబీ వెంకటేశ్వరరావును ఎలా టార్గెట్ చేస్తోందో అందరికీ తెలిసిందే. అధికార దుర్వినియోగం, అవినీతి ఆరోపణలతో ఆయన మీద సస్పెన్షన్ వేటు వేసి సుదీర్ఘ కాలం పక్కనపెట్టడం.. చివరికి కోర్టు ఉత్తర్వులతో ఇటీవలే ప్రింటింగ్ అండ్ స్టేషనరీ కమిషనర్‌గా నియమించడం తెలిసిందే.
కానీ రెండు వారాలు తిరక్కముందే మళ్లీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశారన్న కారణంతో ఆయనపై జగన్ సర్కారు సస్పెన్షన్ వేటు వేసింది. దీనిపై ఏబీ వెంకటేశ్వరరావు విలేకరులతో మాట్లాడారు. మిమ్మల్నే ఎందుకు ఇలా టార్గెట్ చేస్తున్నారని అడిగితే ఆయన ఆసక్తికర సమాధానం ఇచ్చారు.
తాను ఇంటలిజెన్స్ బ్యూరో చీఫ్‌గా ఉన్నపుడు కోడి కత్తి కేసు చేసుకోగా.. దాన్ని అడ్డు పెట్టుకుని రాష్ట్రాన్ని తగలబెట్టాలని కొన్ని శక్తులు ప్రయత్నించాయని.. కానీ కొన్ని గంటల్లో పరిస్థితులను అదుపులోకి తెచ్చామని, ఇది కొంతమందికి నచ్చలేదని ఏబీవీ అన్నారు. ఇలాంటి వెధవ పనులను ఎన్నో తాను అడ్డుకున్నానని.. అందుకే తనపై కక్ష గట్టారని ఆయన వ్యాఖ్యానించారు.
ప్రభుత్వం తనను టార్గెట్ చేయడం లేదని.. కొందరు వ్యక్తులు, శక్తులు తనను ఇబ్బంది పెట్టాలని చూస్తున్నాయని ఆయనన్నారు. మూడేళ్ల వ్యవధలో తనపై వచ్చిన ఆరోపణలు ఏవీ రుజువు కాలేదని, తనపై కేసులు ఏవీ నిలవలేదని.. ఇప్పుడు ఉద్దేశపూర్వకంగా మరోసారి తనపై సస్పెన్షన్ విధించారని, దీనిపై తాను న్యాయ పోరాటం చేస్తానని ఆయనన్నారు. దుర్మార్గుడైన రాజు దగ్గర పని చేయడం కంటే వ్యవసాయం చేసుకోవడం మేలంటూ బమ్మెర పోతన పద్యాన్ని ఆయన ఈ సందర్భంగా ఉటంకించడం విశేషం.