సీఎం జ‌గ‌న్‌కు పేరొస్తోంది.. మాకు రావ‌ట్లేదు.. : వైసీపీలో కొత్త ర‌గ‌డ‌

ఏపీ అధికార పార్టీ వైసీపీలో కొత్త ర‌గ‌డ తెర‌మీదికి వ‌చ్చింది. ఇప్ప‌టి వ‌ర‌కు వైసీపీ అధినేత, సీఎం జ‌గ‌న్‌-ఆయ‌న పార్టీ ఎమ్మెల్యేలు.. నేత‌లు.. అంటే అంతా ఒకే కుటుంబం అని అంద‌రూ అనుకుంటున్నారు. సీఎం జ‌గ‌న్ కూడా అలానే భావిస్తున్నారు. ఇది మ‌న ప్ర‌భుత్వం అనే మాటే ఆయ‌న నోటి నుంచి వినిపిస్తూ ఉంటుంది. అయితే.. ఇప్పుడు కొత్త వాద‌న తెర‌మీదికి వ‌చ్చింది. “ముఖ్య మంత్రికే పేరు వ‌స్తోంది.. మాకు మాత్రం రావ‌డం లేదు” అని సాక్షాత్తూ.. వైసీపీ ఎమ్మెల్యే బ‌హిరంగ వేదిక‌పైనే వ్యాఖ్యానించ‌డం.. సంచ‌లనంగా మారింది.

ఈ వ్యాఖ్య‌ల‌ను బ‌ట్టి.. సీఎం వేరు.. తాము వేరు.. అని ఎమ్మెల్యేలు భావిస్తున్నారా? అనే చ‌ర్చ తెర‌మీదికి వ‌చ్చింది. అదేస‌మయంలో సీఎం జ‌గ‌న్ చేస్తున్న కార్య‌క్ర‌మాల‌తో ఏక వ్య‌క్తి పార్టీగా వైసీపీ ప్ర‌జ‌ల్లోకి వెళ్తోందా? అనే సందేహాలు కూడా క‌లుగుతున్నాయి. ఏం జ‌రిగిందంటే.. ప్ర‌స్తుతం రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ నాయ‌కులు.. జిల్లాస్థాయిలో మినీ ప్లీన‌రీలు నిర్వ‌హిస్తున్నారు. ఈ క్ర‌మంలో ప్ర‌కాశం జిల్లా నిర్వ‌హించిన జిల్లా స్తాయి ప్లీన‌రీకి .. ద‌ర్శి నియోజ‌క‌వ‌ర్గం ఎమ్మెల్యే మ‌ద్దిశెట్టి వేణుగోపాల్ హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. వైసీపీ అధినేత‌పై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.

“సీఎం జ‌గ‌న్‌.. న‌వ‌రత్న ప‌థ‌కాల‌ను అమ‌లు చేస్తున్నారు. దీంతో ఎవ‌రికి పేరు వ‌స్తోంది. ఆయ‌న‌కు మాత్ర‌మే పేరు వ‌స్తోంది. ప్ర‌జ‌ల్లో ఆయ‌న పేరుమాత్ర‌మే వినిపిస్తోంది. మ‌మ్మ‌ల్ని(ఎమ్మెల్యే) ఎవ‌రూ ప‌ట్టించుకోవ‌డం లేదు. మాకు కూడా పేరు రావాలి క‌దా! మేం కూడా క‌ష్ట‌ప‌డుతున్నాం క‌దా! కానీ.. మ‌మ్మ‌ల్ని ప్ర‌జ‌లు పూచిక పుల్ల‌ల్లా తీసిపారేస్తున్నారు. కూర‌లో క‌రివేపాకు నాయ‌కులు మాదిరిగా త‌యార‌య్యాం” అని నిట్టూర్చారు.

అంతేకాదు.. ఈ సంద‌ర్భంగా త‌న నియోజ‌క‌వ‌ర్గం ప‌రిస్థితిని కూడా మ‌ద్దిశెట్టి చెప్పుకొచ్చారు. ద‌ర్శిలో రూ.100 కోట్ల‌తో ప‌నిచేయించిన‌ట్టు చెప్పారు. అయితే.. ఈ నిధుల ఖ‌ర్చుకు సంబంధించి.. ప్ర‌భుత్వం నుంచి రూపాయి కూడా విడుద‌ల కాలేద‌న్నారు. ఇంకా మ‌రిన్ని ప‌నులు చేయించాల్సి ఉంద‌ని.. నిధులు రాక‌పోతే.. ఎలా చేయించాల‌ని ఆయ‌న నిల‌దీశారు. “రోడ్లు, డ్రైనేజీ ప‌నులు చేయించాల్సి ఉంది. ప్ర‌జ‌లు మ‌మ్మ‌ల్ని నిల‌దీస్తున్నారు. గ‌డ‌ప‌గ‌డ‌ప‌కు మ‌న ప్ర‌భుత్వం కార్య‌క్ర‌మానికి వెళ్తే.. వారు నిల‌దీస్తున్నారు. మ‌రి ఏం చేయాలి? ఎమ్మెల్యేల‌కు అంతో ఇంతో పేరు రావాలంటే.. క‌నీసం రోడ్ల‌యినా వేయించాలి క‌దా!” అని ఆయ‌న వ్యాఖ్యానించారు. ప్ర‌స్తుతం ఈ వ్యాఖ్య‌లు రాజ‌కీయ వ‌ర్గాల్లో ముఖ్యంగా వైసీపీ నేత‌ల మ‌ధ్య ఆస‌క్తిగా మారాయి. దీనిపై అధిష్టానం ఏమంటుందో చూడాలి.