వైసీపీ కార్యకర్తల పిల్లలకే వలంటీర్ పదవులు ఇచ్చాం

రాజ‌కీయాల్లో ఒక విష‌యాన్ని సూటిగా చెప్ప‌డం నాయ‌కుల‌కు చాలా క‌ష్టంతో కూడిన ప‌ని. ఏం డ్యామేజీ వ‌స్తుందో.. ఏం జ‌రు గుతుందో అనే భావ‌న వారిలో ఉంటుంది. అందుకే విష‌యం క‌నుక కొంత సంక్లిష్టం అయిన‌ప్పుడు దానిని అటు తిప్పి.. ఇటు తిప్పి.. క‌వ‌ర్ చేసుకునేందుకు ప్రాధాన్యం ఇస్తారు. కొన్ని కొన్ని సార్లు దాట‌వేత వైఖ‌రి కూడా అవ‌లంభిస్తారు. అయితే.. ఇలాంటి ప‌రిణామం.. ఎక్క‌డైనా ఉంటుందేమో కానీ.. వైసీపీలో మాత్రం కాద‌ని అంటున్నారు ఆ పార్టీ నాయ‌కులు. ముఖ్యంగా మంత్రులు అనుస‌రిస్తున్న తీరు మ‌రింత చిత్రంగా ఉంది.

అది వివాద‌మైనా.. విమ‌ర్శ అయినా.. మొహం మీదే అనేస్తున్నారు. త‌ర్వాత జ‌రిగే ప‌రిణామాల విష‌యంలో ఏమాత్రం వెనుకా ముందు ఆలోచించ‌డ‌మే లేదు. ఇలాంటి మంత్రుల్లో తానేటి వ‌నిత ముందు వ‌రుస‌లో ఉండ‌డం గ‌మ‌నార్హం. ప్ర‌స్తుతం హోం మంత్రిగా ఉన్న‌వ‌నిత‌.. రెండోసారి కూడా జ‌గ‌న్ కేబినెట్ లో అవ‌కాశం ద‌క్కించుకున్నారు. అయితే.. తొలి కేబినెట్ లో ఆచితూచి వ్య‌వ‌హ‌రించిన ఆమె త‌ర్వాత మాత్రం దూకుడుగానే వ్యాఖ్య‌లు చేస్తున్నారు. కొన్నాళ్ల కింద‌ట రాష్ట్రంలో యువ‌తు ల‌పై ముఖ్యంగా ఎస్సీ సామాజిక వ‌ర్గానికి చెందిన యువ‌తుల‌పై అత్యాచారాలు జ‌రిగిన‌ప్పుడు.. ఆమె స్పందించిన తీరు వివాదం అయింది.

త‌ల్లులు స‌క్రమంగా పెంచితే.. ఇలాంటి ఘోరాలు జ‌ర‌గ‌వు ఆమె వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్య‌ల‌తో అధికార పార్టీ నాయ‌కులే నివ్వెర పోయారు. దీనిపై మ‌హిళా సంఘాల నుంచి తీవ్ర వ్య‌తిరేక‌త వ‌చ్చింది. ప్ర‌భుత్వం కూడా డిఫెన్స్‌లో ప‌డింది. ఇక‌, ప్ర‌తిప‌క్షాలు ఇప్ప‌టికీ విమ‌ర్శ‌లు చేస్తూనే ఉన్నాయి. క‌ట్ చేస్తే.. మ‌రోసారి ఆమె వివాదానికి తెర‌దీశారు. నిడదవోలులో జ‌రిగిన‌ వైసీపీ ప్లీనరీలో అసంతృప్తిగా ఉన్న పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి హోంమంత్రి ప్రసంగించారు. వలంటీర్ పోస్టులను పార్టీ కార్యకర్తల పిల్లలకే ఇచ్చామని అన్నారు.

కార్యకర్తలను పట్టించుకోలేదనడం అవాస్తవం. వైసీపీ కార్యకర్తల ఇళ్లలోని పిల్లలకే వలంటీర్ పదవులు ఇవ్వడం వాస్తవం కాదా అని సొంత పార్టీ నాయ‌కుల‌నే ఆమె ప్ర‌శ్నించారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ, వార్డు మెంబర్ల పదవులతో పాటు వలంటీర్ పోస్టులు కూడా కార్యకర్తల కుటుంబాలకు ఇచ్చామని హోంమంత్రి తానేటి వనిత వెల్లడించారు. ఈ వ్యాఖ్య‌లు వైసీపీని డిఫెన్స్‌లో ప‌డేశాయి. ఇప్ప‌టి వ‌ర‌కు రాష్ట్రంలోని నిరుద్యోగుల‌కు వ‌లంటీర్ అవ‌కాశం ఇచ్చామ‌ని ప్ర‌భుత్వం ప్ర‌చారం చేసుకుంటోంది. కానీ, ఇప్పుడు వ‌నిత వ్యాఖ్య‌లతో వైసీపీ కార్య‌క‌ర్త‌ల కోస‌మే.. వ‌లంటీర్ పోస్టులు తీసుకువ‌చ్చార‌నే విష‌యం అర్ధ‌మైంద‌ని ప్ర‌తిప‌క్షాలు అంటున్నాయి. కాగా, వైసీపీని డిఫెన్స్‌లో ప‌డేసినా.. ఉన్న విష‌యాన్ని ఉన్న‌ట్టు చెప్పిన.. ఆ మంత్రి గ‌ట్స్‌కు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే అంటున్నారు నెటిజ‌న్లు.