ప్రధాన ప్రతిపక్షం టీడీపీ తరచుగా చెబుతున్న మాట.. తమకు ఓటు బ్యాంకు పెరుగుతోందని. అంతేకాదు .. ఇంకేముంది.. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే.. వైసీపీ ముఠా మొత్తం.. మునిగిపోతుందని.! ఇక, ప్రజల్లోనూ చంద్రబాబు చెబుతున్న మాట… ఈ ప్రభుత్వంపై తిరగబడాలని.. ప్రజావ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న జగన్‌ను ఇంటికి పంపించాలని. అయితే.. ఈ విషయాలు ఎలా ఉన్నా.. టీడీపీ ఓటు బ్యాంకు కూడా వైసీపీ వైపు మళ్లుతున్న సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
తాజాగా జరిగిన ఆత్మకూరు ఉప ఎన్నికలో వైసీపీ భారీ ఎత్తున పుంజుకుంది. నిజానికి 2019 ఎన్నికల్లో ఈ పార్టీ ఓటు బ్యాంకు 52.42 శాతంగా ఉంది. అదేసమయంలో 82.4 శాతం ఓటింగ్ జరిగింది. అంటే.. భారీ ఎత్తున ప్రజలు తరలి వచ్చి.. ఓట్లేసినా.. వైసీపీకి 52 శాతమే ఓట్లు వచ్చాయి. మిగిలిన వాళ్లంతా కూడా టీడీపీ లేదా.. ఇతర పార్టీలు అనుకోవాలి. కాని.. ఇప్పుడు మాత్రం ఈ ఓటు షేరు.. వైసీపీకి 72.24 కు చేరింది. అంటే.. గత ఎన్నికలతో పోల్చితే.. 20 శాతం పైగానే ఉంది.
పైగా తాజాగా జరిగిన ఉప ఎన్నికలో పోలింగ్ కేంద్రాలకు వచ్చి క్యూలో నిలబడి ఓట్లేసిన.. వారు 64.2 శాతం మాత్రమే. అంటే.. ఓటింగ్‌కు ప్రజలు భారీ ఎత్తున కదిలి రాలేదు. కానీ, ఇంత తక్కువ మంది ఓటింగ్ ప్రక్రియలో పాల్గొన్నా.. ఎక్కువ మొత్తంలో అంటే.. 82,888 ఓట్ల మెజారిటీ వైసీపీకి లభించింది. పైగా పెరిగిన 20 శాతం ఓటింగ్‌లో 19.5 శాతం వైసీపీకే పడిందని అంచనా ఉంది. మరి తక్కువ మందే వచ్చారు.. కానీ, ఎక్కువ ఓట్లు పడ్డాయి!
దీనిని బట్టి.. టీడీపీ అనుకూల.. సానుకూల మద్దతుదారులుగా ఉన్న వారు.. కూడా వైసీపీకే గుద్దేశారా? అనేది సందేహాలకు దారితీస్తున్న విషయం. మరి చంద్రబాబు చెబుతున్న వ్యతిరేకత ఎక్కడకు పోయినట్టు? అంతేకాదు.. జగన్ చేస్తున్న తుగ్లక్ పనులను ప్రజలు పట్టించుకోలేదా(చంద్రబాబు భాష).. అంటే.. ఇదే ఇప్పుడు రాజకీయ వర్గాలను డిఫెన్స్‌లోకి నెట్టేసిన పరిణామం. ఎందుకంటే.. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు అధికారంలోకి రావడానికి ప్రయత్నిస్తున్నారు.
కానీ, ఎన్ని విధాల ప్రయత్నం చేసినా.. ఎక్కడా వైసీపీని ఢీ కొట్టి గెలిచేలా.. పరిస్థితి టీడీపీ కి అనుకూలంగా లేదని స్పష్టం అవుతోందని అంటున్నారు పరిశీలకులు. ఇప్పటికిప్పుడు.. చంద్రబాబు తన వ్యూహాన్ని మార్చుకుని.. పార్టీని.. ముందుకు తీసుకువెళ్తే తప్ప. ఈ మార్పులో మార్పు రాదని అంటున్నారు. మూస విధానాలు.. సర్కారును విమర్శించడం.. వంటివి తగ్గించి.. తాము అధికారంలోకి వస్తే.. ఏం చేస్తామనే విషయాన్ని వివరించినప్పుడే ప్రయోజనం ఉంటుందని అంటున్నారు. మరి చంద్రబాబు ఎలా రియాక్ట్ అవుతా రోచూడాలి.