ఏపీ అధికార పార్టీ వైసీపీలో కార్యకర్తలు ఘోష పెడుతున్నారు. తమను పట్టించుకోవడం లేదని..వాడుకుని గాలికొదిలేశారని వారు గగ్గోలు పెడుతున్నారు. దీంతో వైసీపీలో కార్యకర్తల కల్లోలం.. ఆక్రోశం.. స్పష్టంగా కనిపిస్తోంది. అందునా.. సీఎం జగన్ సొంత జిల్లా కడపలోనే ఈ పరిస్థితి ఉండడం మరింతగా పార్టీని డోలాయమానంలో పడేస్తోంది. సీఎం జగన్ సొంత గడ్డ పులివెందులలో ఇటీవల జరిగిన ప్లీనరీలో కార్యకర్తలు అసంతృప్తిగా ఉన్నారు. ఉత్సవ విగ్రహాల్లా ఉన్నాం. సీఎం సార్‌కు చెప్పండంటూ ఓ నాయకుడు మాట్లాడారు. ఇక్కడ ఏకంగా ఎమ్మెల్యే వ్యతిరేక వర్గం ప్లీనరీకి హాజరు కాకపోవడంతో వైసీపీలో ఉన్న గ్రూప్ విభేదాలు స్పష్టంగా బట్టబయలైనట్లు చెబుతున్నారు.
కాంగ్రెస్ పార్టీని వీడి వైసీపీని స్థాపించిన తరువాత కాంగ్రె్‌స్‌లో వైఎస్ కుటుంబాన్ని అభిమానించే క్యాడర్ అంతా జగన్ వెంట నడిచింది. 2011లో పార్టీ పెట్టినప్పటి నుంచి పార్టీ కార్యక్రమాలు, ముఖ్య నేతల పుట్టిన రోజులు, ఇలా అన్నింటిని ఘనంగా నిర్వహించారు. స్థానిక సంస్థల ఎన్నికలు, 2014లో జరిగిన ఎన్నికల్లో కూడా కష్టపడ్డారు. జగన్‌ను సీఎం చేయాలన్న లక్ష్యంతో సొంత డబ్బు ఖర్చు పెట్టుకుని పార్టీ కోసం పనిచేశారు. జగన్ సీఎం అయితే బతుకులే మారిపోతాయని భావించారు.
అందుకు తగ్గట్లుగానే ప్రతిపక్షనేతగా పార్టీ కార్యక్రమాలు నిర్వహించినప్పుడు కార్యకర్తలకు భరోసా ఇస్తూ వచ్చేవారు. చావో రేవో అన్న 2019 ఎన్నికల్లో వైసీపీని గెలిపించారు. జగన్ సీఎం కావడంతో ప్రతి కార్యకర్త సంతోషించాడు. జగన్ సర్కార్‌పై వైసీపీ కార్యకర్తలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కాంట్రాక్ట్ పదవులతో పాటు ప్రాధాన్యత ఉంటుందని అనుకున్నారు. గత ప్రభుత్వ హయాంలో చేపట్టిన పనులకు బిల్లులు ఇవ్వకుండా జగన్ సర్కార్ నిలిపేసింది. టీడీపీ హయాంలో కొన్ని చోట్ల వైసీపీ నేతలు కూడా పనులు చేశారు. ఆ బిల్లులు చాలా వరకు ఇంతవరకు రాలేదు.
రెండు రోజుల క్రితం ఎంపీ అవినాష్‌రెడ్డి అధ్యక్షతన పులివెందుల నియోజకవర్గ స్థాయి కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా వేముల మాజీ ఉపాధ్యక్షుడు రాము మాట్లాడుతూ కార్యకర్తలు అసంతృప్తిగా ఉన్నారనేది వాస్తవం, ప్రజలకు మా ద్వారా పనులు జరగాలి. ప్రస్తుతం విగ్రహాల్లా ఉంటున్నాం. కార్యకర్తలు అసంతృప్తితో ఉన్నారు. మేము మీతో కష్టపడుతున్నాం. కార్యకర్తలను ఆదుకోకుంటే భవిష్యత్తులో ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఎదురవుతుంది.
కార్యకర్తల మనోభావాలు గుర్తించాలి. ప్రస్తుతం మాలో ఉత్సాహం లేదు. పల్లెల్లో మా ద్వారానే పనులు జరగాలి అంతా వలంటీర్లు అంటే నష్టం జరుగుతుంది. దయచేసి ఈ విషయాన్ని జగన్ సర్ దృష్టికి తీసుకెళ్లాలంటూ సభాసాక్షిగా ఎంపీ దృష్టికి తీసుకెళ్లారు. మరి ఇప్పటికైనా… సీఎం జగన్ స్పందిస్తారో లేదో చూడాలి. చిత్రం ఏంటంటే.. ఈ సమస్య ఒక్క కడపకే పరిమితం కాలేదు. రాష్ట్ర వ్యాప్తంగా ఉండడం గమనార్హం.