వచ్చే ఎన్నికల్లో పొత్తులు పెట్టుకుని.. వైసీపీ వ్యతిరేక ఓటు బ్యాంకును చీలకుండా చూస్తానని చెప్పిన పవన్ తడవకోమాట మారుస్తున్నారు. కొన్నిరోజులు తానే ఒంటరిగా పోటీ చేస్తానని చెబుతున్నారు. ఇంకొన్ని సార్లు.. పొత్తులు పెట్టుకునే విషయంలో వైసీపీ నాకు నీతులు చెబుతుందా? అని ప్రశ్నిస్తున్నారు. మరికొన్ని సార్లు.. తనకు పొత్తు అంటూ.. ఉంటే అది ప్రజలతోనే ఉంటుదని చెబుతున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో అసలు పవన్ వ్యూహం ఏంటనేది.. చర్చకు దారితీస్తోంది.
మరోవైపు.. తమకు అధికారం ఇస్తే.. రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామని.. ఇటీవల ప్రకాశం జిల్లా పరుచూరులో ఆయన ప్రకటించారు. అంటే.. సీఎం సీటుపై పవన్ దృష్టి పెట్టారనే చర్చకు ఆయన తెరదీశారు. నిజానికి ఇప్పటి వరకు పవన్ సీఎం సీటుపై పెద్దగా ఆశలు పెట్టుకోలేదు. కానీ, పరుచూరు సభ తర్వాత.. ఆయన వ్యూహం సీఎం సీటుపైనే ఉందని అర్ధమైందని పరిశీలకులు అంటున్నారు. అయితే.. సీఎం పోస్టు విషయంలో ఆశలు ఉండొచ్చు కానీ.. అసలు ఈ పోస్టు తీసుకునే అర్హతలు పవన్‌కు ఉన్నాయా ? అనేది ప్రశ్న.
ఎందుకంటే.. ఇప్పటి వరకు స్వతంత్ర పార్టీలు.. లేదా.. ప్రాంతీయ పార్టీల తరఫున ముఖ్యమంత్రులు అయిన వారిని పరిశీలిస్తే.. వారు చాలా కష్టపడ్డారు. ప్రజల మధ్యే ఉన్నారు. వారి కష్టసుఖాలు తెలుసుకున్నారు. వారినివారు బిల్డప్ చేసుకున్నారు. ప్రజల్లో నమ్మకం కలిగించారు. దివంగత ఎన్టీఆర్ నుంచి వైఎస్వరకు.. తర్వాత.. చంద్రబాబు నుంచి జగన్ వరకు కూడా ప్రజల నుంచి ముఖ్యమంత్రులుగా వచ్చిన వారే. వీరితో పోల్చితే.. పవన్‌ను ఏం చూసి సీఎంను చేయాలనేది ప్రశ్న.
కేవలం.. ఇప్పుడు రాజకీయంగా ఏర్పడిన శూన్యతను అడ్డు పెట్టుకుని ఆయన సీఎం పీఠం కోసం పాకులాడుతున్నారనే వాదన వినిపిస్తోంది. అంటే.. తన మద్దతు లేకపోతే.. వైసీపీయేతర పార్టీలు అధికారంలోకి వచ్చే అవకాశం లేదని.. అందుకే తాను ఏం కోరినా.. ఇచ్చే అవకాశం ఉందని.. పవన్ అనుకుంటున్నారా? అనేది చర్చకు వస్తున్న విషయం.
కానీ.. ఇది సాధ్యం కాదని అంటున్నారు. ఎందుకంటే.. ప్రజల మధ్య పవన్ పట్టుమని ఆరు మాసాలు కూడా లేరు. పైగా.. సమస్యలపైనా.. ఆయనకు ఇతమిత్థంగా అవగాహన లేదు. ఇలాంటి వ్యక్తికి ఎవరైనా సీఎం పీఠం ఎందుకు అప్పగించాలి? అనేది ప్రశ్న. మరి పవన్ వ్యూహం ఏంటో చూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates