మోడీకి అదాని థ్రెట్ తప్పినట్టే

వివిధ రంగాల్లో తారాపథంలో దూసుకుపోతున్న కారణంగా తమకు దిష్టి తగులుతుందని అనుకున్నారో ఏమోగానీ సడెన్ గా సమాజసేవలోకి దిగేసింది అదానీ ఫౌండేషన్. విద్య, వైద్యం, నైపుణ్య రంగాల్లో రు. 60 వేల కోట్లు ఖర్చు చేయాలని డిసైడ్ చేసినట్లు అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ ప్రకటించారు. 60 వేల కోట్ల రూపాయలంటే మామూలు విషయం కాదు. ఏపీ బడ్జెట్ లో దాదాపు సగానికన్నా పెద్ద మొత్తంమనే చెప్పాలి.

ఇన్ని వేల కోట్ల రూపాయలను సమాజ సేవకు ఖర్చు పెట్టాలనే ఆలోచన ఎందుకొచ్చిందో తెలీటం లేదు. నరేంద్రమోడి ప్రధానమంత్రి అయిన దగ్గర నుండి ఒక్కసారిగా అదానీ పేరు దేశంలో మారుమోగిపోవటం మొదలైంది. యావత్ దేశం చూస్తుండగానే అదానీ గ్రూపు వ్యాపార విలువ లక్షల కోట్ల రూపాయల్లోకి వెళ్ళిపోయింది. దాంతో గ్రూపు ఎంతగా పాపులరైందో అంతే స్ధాయిలో నెగిటివ్ ప్రచారం కూడా పెరిగిపోతోంది. పైగా మోడీకి అదానికి లింకు పెడుతూ జరిగే ప్రచారం బాగా పెరిగిపోయింది. తాజా నిర్ణయంతో అది సమసిపోతుందని అదానీ యాజమాన్యం భావించిందేమో మరి.

వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకున్నారో ఏమో మొత్తానికి వేల కోట్ల రూపాయలను సమాజసేవలో ఖర్చు చేయాలని డిసైడ్ అయ్యారు. ఇఫ్పటికే అదానీ గ్రూపు బొగ్గు, మైనింగ్, లాజిస్టిక్స్, విద్యుత్ ఉత్పత్తి, విద్యుత్ పంపిణి, గ్రీన్ ఎనర్జీ, ఎయిర్ పోర్టులు, డేటా సెంటర్లు, సిమెంటు, షిప్పింగ్ రంగాల్లో బాగా చొచ్చుకుపోయింది. తమ ఫౌండేషన్ ద్వారా విద్య, వైద్యం, ఆరోగ్యం, మౌలిక సదుపాయాల కల్పన, నైపుణ్యాభివృద్ధి రంగాల్లో ఖర్చు చేయనున్నట్లు గ్రూపు తెలిపింది.

నిజానికి ప్రతి కార్పొరేట్ కంపెనీ తమ ఆదాయంలో ప్రతి ఏడాది 2 శాతాన్ని సీఎస్ఆర్ రూపంలో సమాజానికి ఖర్చు చేయాలి. సీఎస్ఆర్ అంటే కార్పొరేట్ సోషల్ రెస్పాన్స్ బులిటి రూపంలో విద్య, వైద్యం తదితర రంగాల్లో కచ్చితంగా ఖర్చుచేయాలి. మరి అదాని గ్రూపు ఈ రూపంలో ఇప్పటివరకు ఎంత ఖర్చుచేసిందో ఎవరికీ తెలీదు. సరే ఇప్పటివరకు ఖర్చు చేసిందా లేదా అన్న విషయాన్ని పక్కన పెట్టేస్తే ఇప్పటినుంచైనా సమాజానికి ఎంతోకొంత సేవ చేయాలన్న ఆలోచన రావటం సంతోషించాల్సిందే.