సీఎం కేసీఆర్‌కు హైకోర్టు నోటీసులు

తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌కు రాష్ట్ర హైకోర్టు నోటీసులు జారీ చేసింది. అంతేకాదు. ఆయ‌న‌పై తీవ్ర ఆగ్ర‌హం కూడా వ్య‌క్తం చేసింది. ఏ అధికారంతో మీరు మీ పార్టీకి భూములు కేటాయించారు? మీరు ప్ర‌భుత్వ పాల‌కుడా? లేక‌.. పార్టీ పాల‌కుడిగా అధికారం చేప‌ట్టారా? ప్ర‌జ‌లు మీకు.. అధికారం ఎందుకు ఇచ్చారు. మీ పార్టీకి భూములు కేటాయించుకునే హ‌క్కు మీకు ఎక్క‌డిది? అని ప్ర‌శ్న‌ల వ‌ర్షం కురిపించింది.

విష‌యం ఏంటంటే.. తెలంగాణ ముఖ్యమంత్రి దీపం ఉండ‌గానే ఇల్లు చ‌క్క పెట్టుకుందామ‌నే ఆలోచ‌న చేశారు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ పార్టీ కార్యాల‌యాల‌కు ప‌క్కా భ‌వ‌నాలు నిర్మించుకుందామ‌ని గ‌త ఏడాది తీర్మానం చేశారు. ఈ క్ర‌మంలో హుటాహుటిన ప‌లు జిల్లాల్లో ప్ర‌భుత్వ భూమిని కారు చౌక‌కు టీఆర్ ఎస్‌కు కేటాయించారు. ఈ క్ర‌మంలోనే హైద‌రాబాద్‌లోని అత్యంత ఖ‌రీదైన ప్రాంతంలోనూ పార్టీకి భూమిని కేటాయించారు.

బంజారాహిల్స్‌లో టీఆర్ ఎస్‌కు భారీ భ‌వ‌నాన్ని నిర్మించే సంక‌ల్పంతో భూమి కేటాయిస్తూ.. కొన్ని రోజుల కింద‌ట ఉత్త‌ర్వులు ఇచ్చారు. మొత్తం 4935 గ‌జాల స్థ‌లాన్ని(దాదాపు 100 సెంట్లు) కేటాయించారు. దీనికిగాను గ‌జానికి రూ.100 చొప్పున ధ‌ర నిర్ణ‌యించారు. కానీ , బ‌హిరంగ మార్కెట్‌లో గ‌జం రూ.ల‌క్ష వ‌ర‌కు ప‌లుకుతోంది. అయినా.. సొంత పార్టీ కోసం.. ఆయ‌న నిర్ణ‌యం తీసుకున్నారు.

ఇదే వివాదంగా మారింది. ఈ భూ కేటాయింపుపై రిటైర్డ్ ఉద్యోగి మహేశ్వర్‌రాజ్ రాష్ట్ర హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖ‌లు చేశారు. దీనిపై విచారణ చేప‌ట్టిన హైకోర్టు.. అత్యంత ఖరీదైన భూమిని గజానికి రూ.100 చొప్పున కేటాయించ‌డాన్ని తీవ్ర‌స్థాయి త‌ప్పుబ‌ట్టింది. ప్రైవేటు వ్య‌క్తుల‌కు కూడా ఇలానే కేటాయిస్తారా? పేద‌ల‌కు కూడా ఇలానే ఇక్క‌డ భూమిని ఇస్తారా? అని ప్ర‌శ్నించింది. అస‌లు పార్టీకి భూమిని కేటాయించే హ‌క్కు.. సీఎంకు ఉంటుందా? అని నిల‌దీసింది. దీనిపై పూర్తి వివ‌రాల‌తో నాలుగు వారాల్లో కౌంటర్లు దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించింది.