టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు అయ్యన్నపాత్రుడు ఇంటి గోడ కూల్చివేత కేసులో ప్రభుత్వానికి హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. తిరిగి గోడ కట్టుకునేందుకు హైకోర్టు అనుమతి ఇచ్చింది. అక్రమంగా గోడ కూల్చి వేయడంతో పిటీషన్ వేయాలని హైకోర్టు అయ్యన్న తరపు న్యాయవాదులను ఆదేశించింది. దీనిపై తగిన ఆదేశాలు ఇస్తామని స్పష్టం చేసింది. అధికారుల చర్యలు దారుణంగా ఉన్నాయని.. కోర్టు తెలిపింది. దీనిపై అఫిడవిట్ దాఖలు చేయాలని సంబంధిత శాఖలకు ఆదేశాలు జారీ చేసింది.
నర్సీపట్నం పురపాలక సంఘం, జలవనరుల శాఖ అనుమతి ఇచ్చినా.. గోడ కూల్చివేశారని అయ్యన్న పాత్రుడి తరుపు న్యాయవాది హైకోర్టు దృష్టికి తెచ్చారు. అర్ధరాత్రి సమయంలో గోడ కూల్చి వేశారని ఆధా రాలు చూపారు. కాగా జాయింట్ సర్వేకు అయ్యన్న కుమారులు దరఖాస్తు చేశారని ప్రభుత్వ న్యాయవా దులు చెప్పారు. ప్రభుత్వం తరుపు న్యాయవాది, అయ్యన్న పాత్రుడి న్యాయవాది వాదనలు అనంతరం గోడ నిర్మించుకునేందుకు హైకోర్టు అనుమతి ఇచ్చింది.
దీనిపై టీడీపీ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. ఇదిలావుంటే, ఈ నెల 19, ఆదివారం తెల్లవారుజామున నర్సీపట్నంలోని అయ్యన్న ఇంటికి బుల్‌డోజర్‌తో వెళ్లిన అధికారులు.. ఇంటి ప్రహరీ గోడ, వంట గది కూడా.. పంట పొలాన్ని ఆక్రమించి కట్టారంటూ.. బల ప్రయోగం చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ప్రహరీ గోడను కూల్చి వేయగా.. టీడీపీ శ్రేణులు చుట్టుముట్టడంతో.. ఎక్సకవేటర్ డ్రైవర్ అక్కడ నుంచి పరారయ్యాడు. దీంతో కూల్చివేతలు ఆగిపోయాయి.
ఇది రాజకీయ దుమారానికి దారి తీసిన విషయం తెలిసిందే. తాజాగా ఈ విషయంపై హైకోర్టులో విచారణలు జరిగాయి. అధికారుల దూకుడు సరికాదని.. హైకోర్టు అభిప్రాయపడింది. ఇంటికి పూర్తిగా అనుమతులు ఉన్నాయని.. అలాంటప్పుడు.. అర్ధరాత్రి కూల్చివేతలు ఎందుకని.. ప్రశ్నించింది. ఇంటి ప్రహరీని నిర్మించుకునేందుకు అనుమతించాలన్న అయ్యన్న పాత్రుడు కుమారుడు విజయ్ అభ్యర్థనను కోర్టు అనుమతించింది.