డీఎస్సీ-98లో చిత్ర విచిత్రాలు

జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తాజాగా క్లియర్ చేసిన డీఎస్సీ-98లో కొన్ని చిత్రవిచిత్రాలు చోటు చేసుకున్నాయి. రిటైర్మెంట్ కు దగ్గరగా ఉన్న వాళ్ళకి, మరో పదిరోజుల్లో ఉద్యోగాల నుండి రిటైర్ అవుతున్న వారికే కాదు చివరకు ఎంఎల్ఏకి కూడా టీచర్ పోస్టింగ్ రాబోతోంది. 1998లో డీఎస్సీ రాసి క్వాలిఫై అయి టీచర్ ఉద్యోగాల కోసం వేలాది మంది అభ్యర్ధులు ఎదురుచూస్తున్నారు. అయితే వివిధ కారణాలతో కోర్టులో కేసులు దాఖలయ్యాయి.

విచారణ తర్వాత కోర్టు సమస్యను పరిష్కరించి డీఎస్సీ-98 లో క్వాలిఫైడ్ అభ్యర్థులకు ఉద్యోగాలు ఇవ్వమని ఆదేశించింది. అయినా ఏ ప్రభుత్వమూ ఉద్యోగాలు ఇవ్వలేదు. అలాంటిది ఇపుడు జగన్ ఆ ఫైలును క్లియర్ చేసి వెంటనే ఉద్యోగాలు ఇవ్వాలని ఆదేశించారు. ఇపుడీ విషయంలోనే చాలా చిత్రాలు చోటుచేసుకుంటున్నాయి. కర్నూలు జిల్లాలో రోజుకూలీగా పనిచేస్తున్న 56 ఏళ్ళ నాగరాజుకు ఇఫుడు ఉద్యోగం రాబోతోంది.

అలాగే తమ్మిరాజు అనే 62 ఏళ్ళ ఉద్యోగి మరో పదిరోజుల్లో రిటైర్ కాబోతున్నారు. ఇపుడీయనకు కూడా టీచర్ ఉద్యోగం వచ్చింది. వీళ్ళలాగే నరవా అప్పారావు, డీఎం రావు, రాధా రుక్మిణి లాంటి వారికీ ఇపుడు టీచర్ ఉద్యోగాలు రాబోతున్నాయి. వీళ్ళేకాకుండా అనకాపల్లి జిల్లా చోడవరం ఎంఎల్ఏ కరణం ధర్మశ్రీకి కూడా టీచర్ ఉద్యోగం వచ్చింది. వీళ్ళేకాకుండా ఇలాంటి వాళ్ళందరికీ ఇపుడు ఉద్యోగాలు ఎందుకొచ్చాయి ?

ఎందుకంటే 1998లో టీచర్ ఉద్యోగం రాకపోవటంతో డీఎస్సీ-98లో టీచర్ పోస్టులకు సెలక్టయిన వారిలో అత్యధికులు కాలక్రమంలో ఇతర ఉద్యోగాల్లో చేరిపోయారు. ఎప్పుడో 25 ఏళ్ళక్రితం రాసిన డీఎస్సీ పరీక్షల్లో ఇపుడు ఉద్యోగం రావటంతో చాలామంది ఆశ్చర్యపోతున్నారు. తమకు టీచర్ ఉద్యోగం వస్తుందని తాము అనుకోలేదని తమ్మిరాజు చెప్పారు. మరో పదిరోజుల్లో ఉద్యోగం నుండి రిటైర్ కాబోతున్న తనకు హఠాత్తుగా టీచర్ ఉద్యోగం రావటం ఆశ్చర్యంగానే ఉందన్నారు.

టీచర్ పోస్టుకు సెలక్టయి కూడా కోర్టు కేసుల్లో ఇరుక్కోవటంతో ఉద్యోగం రాదని నాగరాజు నిర్ణయించుకున్నాడు. ఇతర ఉద్యోగాలకు ప్రయత్నించి సాధ్యం కాకపోవడంతో చివరకు రోజుకూలీగా స్ధిరపడిపోయాడు. ఇలాంటి నాగరాజుకు 25 ఏళ్ళ తర్వాత టీచర్ గా ఉద్యోగం రావటంతో సంతోషంతో ఏమి మాట్లాడాలో అర్ధం కావటం లేదట. డీఎస్సీ-98 నియామకాల్లో ఇలాంటి చిత్రవిచిత్రాలు చాలానే చోటుచేసుకున్నాయి.