జనసేన అధికారంలోకి రాగానే జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని పవన్ కళ్యాణ్ అన్నారు. ప్రకాశం జిల్లా పరుచూరులో నిర్వహించి న బహిరంగ సభలోల ఆయన మాట్లాడుతూ.. లక్షకోట్లు దోపిడీ చేసే సత్తా వైసీపీ వాళ్లకి ఉన్నప్పుడు.. రెండున్నర లక్షల ఉద్యోగాలు తెచ్చే సత్తా జనసేనకు ఉందన్నారు. అధికారంలోకి వచ్చేందుకు చాలాసార్లు ఇతరులకు అవకాశం ఇచ్చారని, ఈ సారి జనసేనకు అవకాశం ఇవ్వండని ప్రజలను కోరారు. రాబోయే ఎన్నికలు కీలకమైనవన్న పవన్.. ఈ సారి ప్రజలు జనసేన వైపు చూడాలని కోరారు.
రాబోయే ఎన్నికల్లో తమకు అండగా ఉండి, ఆశీర్వదించాలని కోరారు. దసరా వరకు వైసీపీ నేతలు ఏమన్నా పట్టించుకోబోమ న్న పవన్.. ప్రజల సమస్యలు వినడానికి దసరా తర్వాత రోడ్డెక్కుతామని, అప్పుడు వాళ్లకు ఉంటుందని హెచ్చరించారు. వైసీపీ సర్కారు రూ.5లక్షల కోట్లు అప్పు తెచ్చిందని, అవి ఏం చేశారని ఎమ్మెల్యేలను అడగండని పిలుపునిచ్చారు. 2024లో మళ్లీ వైసీపీ అధికారంలోకి వస్తే రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరుగుతుందన్నారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించిన వారిని మానసికంగా హింసిస్తున్నా రని, రాజకీయ కక్ష తీర్చుకోవడానికి మాత్రమే అధికార యంత్రాంగాన్ని వినియోగిస్తున్నారని, కౌలు రైతుల కష్టాలు తీర్చేందుకు మాత్రం ఉపయోగించడంలేదని పవన్ విమర్శించారు.
తాను సీఎం కాకపోతే రాజకీయాల్లోంచి వెనక్కి వెళ్లి పోయేందుకు పార్టీ పెట్టలేదని, సరిగా పనిచేయకపోతే సీఎం చొక్కా పట్టుకునే విధంగా యువకులను తయారు చేసేందుకే రాజకీయాల్లోకి వచ్చానని అన్నారు. సొంత జేబులు నింపుకునే వాళ్లను కాకుండా.. బాధ్యత కలిగిన వ్యక్తులను అసెంబ్లీకి పంపాలని ప్రజలను పవన్ కోరారు. అప్పటి వరకు రాష్ట్రం బాగుపడదని పవన్ అన్నారు. ప్రజాప్రతినిధులుగా కొత్త తరం నేతలు రావాల్సిన అవసరం ఉందన్నారు.
ఎన్నో కష్టాలు పడ్డా!
జీవితంలో తనకు ఎలాంటి కోరికలూ లేవన్న పవన్.. అన్నింటినీ త్యజించే రాజకీయాల్లోకి వచ్చానన్నారు. అయితే.. పార్టీ పెట్టినప్పటి నుంచీ ప్రతికూల పరిస్థితులే ఎదురయ్యాయని అన్నారు. అయినప్పటికీ.. ప్రజలకు అండగా నిలబడతామని ఇచ్చిన మాటకోసం.. వారి వెంటే ఉన్నామని చెప్పారు. తనను దత్తపుత్రుడు అన్న వ్యాఖ్యలపై స్పందించిన పవన్.. తాను ప్రజలకు దత్తపుత్రుడినే అని అన్నారు. మన దగ్గర క్రిమినల్ కేసులున్న యువతకు ఉద్యోగాలు రావు.. క్రిమినల్ కేసులుండే నాయకులు మాత్రం ఎన్నికల్లో ఎలా పోటీ చేస్తారని ప్రశ్నించారు. ఎన్నికల్లో పోటీచేసే వారికి నియమ నిబంధనలు వర్తించవా? అని నిలదీశారు. ఒకసారి గెలిస్తే ఐదేళ్లపాటు ఏం చేయలేరనే ధీమాతో ఉన్నారని, సరిగా పనిచేయకపోతే రెండేళ్ల తర్వాత రీకాల్ చేసే విధంగా చట్టం రావాలని అన్నారు.
వైసీపీ నేతలు దోచేశారు..
వైసీపీ అసమర్థ పాలన వల్ల ప్రకాశం జిల్లా నుంచి వలసలు బాగా పెరిగాయని పవన్ కల్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రకాశం జిల్లాలో వైసీపీ రాజకీయ నాయకుల వద్ద మాత్రమే డబ్బు ఉందని, సామాన్య ప్రజలు పొట్ట చేతపట్టుకొని వలసలు పోతున్నారని అన్నారు. ప్రకాశం జిల్లా దుస్థితిని మార్చేందుకు మహిళలు కొంగు బిగించాలి జనసేనాని పిలుపునిచ్చారు. రాష్ట్ర విభజన జరిగినప్పటినుంచీ.. ఆంధ్రకు అన్యాయమే జరుగుతోందన్న పవన్.. అయినా అధికార పార్టీ నాయకులు ప్రశ్నించడం లేదని అన్నారు. బిజినెస్ వ్యవహారాలు చూసుకోవడానికే పార్లమెంటు, అసెంబ్లీకి వెళ్తున్నారని ఆరోపించారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates