ఏపీలో మహిళలకు అన్ని రూపాల్లోనూ సాయం చేస్తున్న ప్రభుత్వం తమదేనని పదే పదే చెబుతున్న జగన్ సర్కారు.. తాజాగా మహిళలకు.. ముఖ్యంగా ఎలాంటి ఆధారం లేని.. ఒంటరి మహిళలకు.. మొండి చేయి చూపించింది. వైఎస్‌ఆర్ పింఛను కానుక పథకం కింద ఒంటరి మహిళలకు, భర్త నుంచి విడిపోయిన, వివాహం కాని స్త్రీలకు ఇచ్చే పింఛను అర్హత వయసును ప్రభుత్వం పెంచింది. ఇప్పటి వరకు 35 ఏళ్లు దాటిన ఒంటరి మహిళలకు పింఛను ఇస్తుండగా ఇకపై కొత్తగా దరఖాస్తు చేసుకునే వారికి 50 ఏళ్లు దాటితేనే సాయాన్ని అందిస్తామని స్పష్టం చేసింది.
భర్తను వదిలి/భర్త వదిలేసి కనీసం ఏడాది గడిచిన తర్వాతే పింఛనుకు అర్హత ఉంటుందని వెల్లడించింది. ఆమె ఒంటరిగా ఉంటున్నట్లు తగిన ధ్రువీకరణ పత్రాలు సమర్పించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ఈ మేరకు సర్కారు ఆదేశాలు జారీ చేసింది. అంతేకాదు.. అవివాహిత మహిళల పింఛను అర్హత వయసును సైతం ప్రభుత్వం పెంచింది. ఇప్పటివరకు గ్రామీణ ప్రాంతాల్లోని అవివాహిత మహిళలకు 30 ఏళ్లకే పింఛను మంజూరు చేస్తుండగా ఆ వయసును కూడా 50 ఏళ్లు చేసింది.
పట్టణ ప్రాంతాల్లోని అవివాహిత మహిళల అర్హత వయసును సైతం 35 ఏళ్లనుంచి 50 ఏళ్లకు పెంచింది. అవివాహిత మహిళలకు కుటుంబం నుంచి ఎలాంటి సహాయ సహకారాలు అందకూడదనే నిబంధన పెట్టింది. అంతేకాకుండా పెళ్లి కాలేదనే ధ్రువీకరణ పత్రాన్ని స్థానిక తహసీల్దారు నుంచి తీసుకొని సమర్పించాలని స్పష్టం చేసింది. . రాష్ట్రవ్యాప్తంగా ఒంటరి మహిళల విభాగంలో 1,88,062 మంది పింఛను తీసుకుంటున్నారు. వీరికి నెలకు రూ.2,500 చొప్పున ప్రభుత్వం ఇస్తోంది.
ప్రస్తుతం ప్రభుత్వం 6 నెలలకొకసారి పింఛను మంజూరు విధానాన్ని అమలు చేస్తోంది. అందులో భాగంగా జులై 1వ తేదీన కొత్త పింఛన్లను అందిస్తామని ప్రకటించింది. ఇప్పటికే పాత నిబంధన ప్రకారం చాలా మంది పింఛను కోసం ఒంటరి మహిళలు దరఖాస్తు చేసుకున్నారు. తాజా ఉత్తర్వులు వీటికి వర్తింపజేస్తే వీరు పింఛన్లు కోల్పోయే అవకాశం ఉంది. మరి దీనిని బట్టి జగనన్న మహిళలకు చేస్తున్న మేలేమిటో ఇట్టే అర్ధమవుతోందని అంటున్నారు పరిశీలకులు.
Gulte Telugu Telugu Political and Movie News Updates