పవన్ దూరం జరుగుతున్నారా ?

బీజేపీకి దూరం జరగాలని జనసేన అదినేత పవన్ కల్యాణ్ దాదాపు డిసైడ్ అయిపోయారు. ఆ విషయం ఆయన మాటల్లోనే కాదు చేష్టల్లోనూ బయటపడుతోంది. తాజాగా ఏపీకి ప్రత్యేక హోదా అంశానికి తాము కట్టుబడి ఉన్నట్లు స్పష్టంగా ప్రకటించారు. ఏపీకి ప్రత్యేకహోదా అంశాన్ని నరేంద్రమోడి ప్రభుత్వం తుంగలో తొక్కేసింది. విభజన చట్టంలో రాజమార్గంలో రాష్ట్రానికి రావాల్సిన ప్రత్యేకహోదా చివరకు రాజకీయంగా తీవ్ర వివాదాస్పదంగా మారిపోయింది.

ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ప్రత్యేకహోదా అన్నది రాజకీయ అంశంగా మారిపోయింది. ఏపీలో ఎవరు అధికారంలో ఉన్నారనే విషయంతో సంబంధం లేకుండా కేంద్రానికి ఏపీ ఎంపీలతో అవసరం పడితేనే హోదా విషయమై మోడి ఆలోచించరన్నది వాస్తవం. అప్పుడు కూడా ఏపీలో అధికారంలో ఉన్నవారు ప్రత్యేకహోదాపై గట్టిగా పట్టుబడితేనే కేంద్రం దిగొస్తుంది. మనం చెప్పుకున్న సందర్భం ఇప్పుడిప్పుడే వస్తుందని ఎవరు అనుకోవటంలేదు.

ఈ నేపధ్యంలోనే పవన్ హఠాత్తుగా ప్రత్యేకహోదా అంశానికి కట్టుబడున్నట్లు ప్రకటించటంలో అర్ధమేంటి ? హోదాను మోడి ఇవ్వరని తెలిసీ ఎన్నికల హీట్ పెరిగిపోతున్న సమయంలో పవన్ చేసిన ప్రకటన వ్యూహాత్మకంగా ఉందనే అనిపిస్తోంది. పవన్ ఒకవైపు టీడీపీతో పొత్తుపెట్టుకోవాలని మానసికంగా నిర్ణయమైపోయారు. ఇదే సమయంలో తనంతట తానుగా బీజేపీని వదిలిపెట్టలేరు. అందుకనే బీజేపీకి ఇష్టంలేని ప్రత్యేకహోదా అంశాన్ని లేవనెత్తటం ద్వారా కమలనాదులను రెచ్చగొడుతున్నట్లే ఉంది.

ప్రత్యేకహోదా విషయాన్ని కెలకటం ద్వారా వాళ్ళని రెచ్చగొట్టి పొత్తుల విషయాన్ని వాళ్ళతోనే వద్దని చెప్పించటమే పవన్ వ్యూహమా అని అనుమానంగా ఉంది. వాళ్ళంతట వాళ్ళతోనే పవన్ తో పొత్తువద్దని చెప్పించుకుని టీడీపీకి దగ్గరయ్యే ప్లాన్ చేస్తున్నట్లున్నారు. లేకపోతే ఇప్పటిప్పుడు ప్రత్యేకహోదా అంశాన్ని లేవనెత్తాల్సిన అవసరం పవన్ కు లేదన్న విషయం అందరికీ తెలుసు. నిజానికి బీజేపీకి ఇష్టంలేని హోదా అంశాన్ని పవన్ ప్రస్తావించకూడదు. అయినా ప్రస్తావించారంటే దానివెనుక ఏదో పెద్ద ప్లానులోనే ఉన్నారని అర్ధమైపోతోంది. మరిపుడు పవన్ చేసిన ప్రకటనకు కమలనాదులు ఏ విధంగా స్పందిస్తారనేది ఆసక్తిగా మారింది.